అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే అంతే సంగతులు

  • ఒక్కచుక్క  చమురును కూడా సరఫారా కానివ్వం
  • ఇరాన్‌ ‌మరోమారు ఘాటు హెచ్చరికలు

న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : అమెరికా తమపై ఆర్థిక యుద్దాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్‌ ‌హెచ్చరించింది. హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్‌ ‌రెజాయీ ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రెజాయీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక యుద్ధం కొనసాగితే హోర్ముజ్‌ ‌జలసంధి ద్వారా మాత్రమే కాకుండా పర్షియన్‌ ‌గల్ఫ్ ‌నుంచి కూడా ఒక్క చుక్క చమురునూ ఎగుమతి చేయనీయమని రెజాయీ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక చర్యలకు మద్దతు ఇచ్చే లేదా వాటిలో భాగస్వాములయ్యే దేశాలను కూడా ఇరాన్‌ ‌శత్రువులుగా పరిగణిస్తుందని రెజాయీ హెచ్చరించారు.

అలాంటి దేశాలపై ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా భారీ ఆర్థిక ఆంక్షలకు సిద్ధమవుతోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ ‌బెసెంట్‌ ఈ ‌చర్యలను ’ఎకనామిక్‌ ‌డీ-డే’గా అభివర్ణించారు. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడమే తమ ఉద్దేశమని వాషింగ్టన్‌ ‌చెబుతోంది. అయితే ఇరాన్‌ ‌మాత్రం ఈ ఆంక్షలను ఎదుర్కొంటామని స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఇరాన్‌ ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఈ వారాంతంలో 20 కంటే తక్కువ వాణిజ్య నౌకలు మాత్రమే హోర్ముజ్‌ ‌గుండా వెళ్లినట్లు నౌకాయాన సమాచారం వెల్లడించింది. హోర్ముజ్‌ ‌ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *