– అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
– ఫాస్ట్ ట్రాక్‌లో దరఖాస్తులు పరిష్కారం.. 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తి
– అక్రమార్కులపై క్రిమినల్ కేసులు
– యూఎల్‌సీపై త్వరలో విధానపరమైన నిర్ణయం
– ప్రధాన ప్రతిపక్షం కోరితే సీఎస్-7, సీఎస్-14 భూ వ్యవహారంపై ‘సెట్’ దర్యాప్తు
– మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : రాష్ట్రంలో 22-ఏలో లక్షలాది ఎకరాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు ఎంతమేర నిషేధిత జాబితాలో ఉన్నాయో పూర్తి వివరాలను ప్రజల ముందుంచుతున్నామని వెల్లడించారు. 22-ఎ పేరిట ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాన్ని సృష్టిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. 22-ఎ పేరిట ఇంతవరకు వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, దీనిపై దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం వచ్చే నాటికి నిషేధిత జాబితాలో ఉన్న అటవీ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రైవేట్ భూములు తదితర వివరాలను కేటగిరీల వారీగా మొత్తం వివరాలను మీడియాకు విడుదల చేశారు. లక్షలాది ఎకరాలు 22-ఎలో పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం కాదు.. ఎంత ఉంది, ఎందుకు ఉంది, ఎవరి భూమి, ఏ కారణంతో నిషేధిత జాబితాలో పెట్టారనే ప్రతి అంశాన్ని రికార్డులతో చెబుతాం.. వాస్తవాలు ప్రజల ముందుకు వస్తే ఎవరు నిజం చెబుతున్నారో వారే నిర్ణయిస్తారన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు లేదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటం 22-ఏ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరోచోట 400కు పైగా ఎకరాలు కలిపి సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారాలను మంత్రి ఉదాహరణగా ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఈ భూముల వ్యవహారం అప్పట్లో మీడియాలో కూడా చర్చకు వచ్చిందని, ప్రభుత్వ భూములపై భారీ విస్తీర్ణాల్లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇలాంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టడం తప్పా? ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు అసైన్‌మెంట్ జరిగినట్లు చూపిస్తూ సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే భూములపై హక్కులు సృష్టించి ధారదత్తం చేశారన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సర్వే నం.403కు సంబంధించి సుమారు 1,280 ఎకరాల విస్తీర్ణం ఉండగా అందులో రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులు అప్‌లోడ్ చేసే సమయంలో మొత్తం సర్వే నంబర్‌ను పేర్కొనడం వల్ల ముఖ్యమంత్రి నివాసంతోపాటు తన నివాసం కూడా పీవోబీలో చేర్చారని, దానిని గుర్తించి వెంటనే సరిచేశామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో సర్వే నం.172 ప్రభుత్వ భూమి, 173 ప్రైవేట్ భూమి అని, 173 పేరుతో అనుమతులు తీసుకుని 172 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన ఉదాహరణను మంత్రి వివరించారు. ‘ప్రైవేట్ సర్వే నంబర్ పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తే ఆ ప్రభుత్వ భూమిని 22-ఏలో పెట్టకూడదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కాపాడటం తమ బాధ్యత’ అని వివరించారు. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ ప్రాంతంలో ప్రధాన రెవెన్యూ గ్రామం, దానికి అనుబంధ శివారుకు ఒకే తరహా సర్వే నంబర్లు కేటాయించడం వల్ల భూ వివాదాలు తలెత్తాయని మంత్రి చెప్పారు. సర్వే నంబర్లను సక్రమంగా పునర్వ్యవస్థీకరించి, సమగ్ర సర్వే ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. మహేశ్వరం మండలంలోని 22 ఎకరాల సర్వే నంబరులో రెండెకరాలు భూదాన్ భూమి ఉంటే మొత్తం 22 ఎకరాలకు పాస్‌బుక్ జారీ కావడం, భూదాన్ రెండెకరాలను ప్రత్యేకంగా గుర్తించడంలో సమస్య ఏర్పడడంతో మొత్తం 22 ఎకరాలను పీవోబీలో పెట్టా రని చెప్పారు. భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో రికార్డులను కేసుల వారీగా పరిశీలించి వాస్తవ హక్కుదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నకిలీ జీవోలు, మెమోలు, అధికారుల సంతకాలతో బోగస్ పత్రాలు సృష్టిస్తున్న వ్యవహారాలను గుర్తించామని, ఆమేరకు క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలిస్తున్నామని చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఏప్రిల్ 22వ తేదీతో జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్లు చూపిస్తూ ఒక నకిలీ మెమోను, మరోచోట జూన్ 2వ తేదీతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరుతో బోగస్ సర్టిఫికెట్‌ను సృష్టించి రిజిస్ట్రేషన్ కోరిన వ్యవహారాలను గుర్తించామని చెప్పారు. సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం(యూఎల్‌సీ)కి సంబంధించి కొద్ది రోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎస్-7, సీఎస్-14కు సంబంధించి 2017లో అప్పటి బీఆరఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక ఎండీ ఒక భూస్వామి నుంచి ఎస్ క్లాస్ బెంజి కారు తీసుకుని ఐదు డాక్యుమెంట్ల ద్వారా 811 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంశంపై ప్రధాన ప్రతిపక్షం కోరితే సెట్ దర్యాప్తునకు ఆదేశిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్, మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతాల్లో యÖఎల్‌సి క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యలను మంత్రి పొంగులేటి వివరించారు. యÖఎల్‌సీ క్లియర్ చేసుకున్న భూములకు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని, యÖఎల్‌సీకి దరఖాస్తు చేయని లేదా క్లియరెన్స్ పొందని భూములు నిషేధిత జాబితాలో ఉండటం సహజమేనని చెప్పారు. యూఎల్‌సీ క్లియర్ చేసుకున్న వారికి ఇబ్బంది లేదు.. అవసరమైన పత్రాలు అందిస్తే ప్రభుత్వం పరిశీలించి క్లియర్ చేస్తుంది అని చెప్పారు. కానీ యÖఎల్‌సి కూడా చేయించుకోకుండా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ ప్రచారం చేయడం సరికాదన్నారు.
22-ఎ సమస్యలపై టోల్‌ఫ్రీ నంబరుకు 1162 కాల్స్
22-ఏ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి తెలిపారు. రిపీటెడ్, ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. వీటిలో 547 వ్యవసాయ భూములు, 433 వ్యవసాయేతర భూములకు సంబంధించినవని తెలిపారు. రంగారెడ్డి నుంచి 258, మేడ్చల్ నుంచి 149, సంగారెడ్డి నుంచి 82, కామారెడ్డి నుంచి 44, యాదాద్రి భువనగిరి నుంచి 40, సిద్దిపేట నుంచి 35 కాల్స్ వచ్చినట్లు వివరించారు. 22-ఎపై కొన్ని పత్రికల్లో వస్తున్నట్లు తీవ్ర సమస్య లేదన్నారు. ఇప్పటికే రిలాక్సేషన్ పొందిన 22-ఏ కేసుల్లో సుమారు 98 శాతం స్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. 300కు పైగా స్లాట్లలో దేవాదాయ, భూదాన్ తదితర కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వీలు లేని 12-13 కేసులను మాత్రమే తిరస్కరించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి ఈ వారాంతం లోపు ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. 22-ఏకు సంబంధించిన నిజమైన సమస్యలను 24 గంటల్లో, అవసరమైన సందర్భాల్లో గరిష్ఠంగా 36 గంటల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలను భయపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదు.. ప్రజలకు భరోసా కల్పించడం తమ బాధ్యత. ప్రభుత్వ భూములను కాపాడటం ఎంత ముఖ్యమో న్యాయబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం’ అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతీ ఫిర్యాదును పరిశీలిస్తాం.. ప్రతీ రికార్డును ధ్రువీకరిస్తాం.. తప్పు జరిగితే సరిదిద్దుతాం.. అక్రమం జరిగితే చర్యలు తీసుకుంటాం. కానీ తప్పుడు ప్రచారంతో ప్రజలను భయాందోళనలకు గురి చేయడాన్ని ప్రభుత్వం అనుమతించదు అని అన్నారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





