– ఫ్యూచర్ సిటీపై మాట్లాడుతుంటే నవ్వొస్తోంది
– రెండేళ్లలో 108 ఎంవోయూలు కుదుర్చుకున్నాం
– పెట్టుబడుల ఆకర్షణకు ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సిస్టం ఏర్పాటు
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ఫ్యూచర్ లేని బీఆర్‌ఎస్ పార్టీ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. పెట్టుబడుల ఆకర్షణపై శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కొద్దనుకునే పార్టీ.. పెట్టుబడులు పెట్టకుండా పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసే పార్టీ బీఆర్‌ఎస్ అని అన్నారు. ఫార్మా సిటీ పేరిట గత ప్రభుత్వం తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, అక్కడ ‘గ్రీన్ ఫార్మా’ పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రేర్, ప్యూర్ ఏరియాల్లో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలను కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధిని మరింత ప్రోత్సహించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలకు శ్రీకారం చుడతామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ మేరకు అనేక ప్రోత్సహకాలు, రాయితీలను అందిస్తోందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్టోరియల్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ముఖ్యంగా ఎగుమతి ఆధారిత సెక్టార్లకు ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ‘గ్రీన్ కేటగిరీ’ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఆ మేరకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఎంవోయూను క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి రాష్ట్రంలోని టైర్ 2, టైర్ 2 నగరాలు, పట్టణాలకు విస్తరించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోడ్‌షోలు, సెక్టోరల్ కాంక్లేవ్స్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తలెత్తకుండా నోడల్ అధికారులతో ప్రత్యేకంగా ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు. కాలపరిమితితో కూడిన సింగిల్-విండో క్లియరెన్సులు, సెల్ఫ్-సర్టిఫికేషన్, ఇన్సెంటివ్స్, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గత రెండేళ్లలో (2025, 2026) రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో పెట్టుబడుల నిమిత్తం మొత్తం 108 ఎంవోయూలు కుదుర్చుకుందని చెప్పారు. గత ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో కుదుర్చుకున్న 75 ఎంవోయూ లలో 23% (17 ప్రాజెక్టులు) ఇప్పటికే ఆపరేషన్‌లోకి వచ్చాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రెండేళ్లలో దావోస్ పర్యటనలో చేసుకున్న ఎంవోయూలలో దాదాపు 45 శాతం ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
ఐటీ హబ్స్/టవర్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్స్/టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. నిజామాబాద్ ఐటీ టవర్/హబ్‌పై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. యాంకర్ పార్టనర్స్/ఇండస్ట్రీ పార్టనర్స్ భాగస్వామ్యం లేకుండానే నిర్మించడం వల్ల చాలాచోట్ల ఐటీ హబ్స్/టవర్స్ నిరుపయోగంగా మారాయన్నారు. అలాంటి వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి టైర్-2 నగరాలకూ ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ హబ్/టవర్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నామని చెప్పారు. యాంకర్ పార్ట్‌నర్స్/ ఇండస్ట్రీ పార్ట్‌నర్స్ ముందుకొస్తే కొత్తగా ఐటీ హబ్స్/టవర్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం ఏ మాత్రం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ సభ్యులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేలా తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని చెప్పారు. గత రెండేళ్లలో 75కి పైగా జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయని, ఇది దేశంలోనే రికార్డు.. రెండేళ్ల హయాంలో లక్షమందికి కొత్తగా ఉద్యోగాలు దక్కాయి అని వివరించారు. త్వరలోనే కొత్త జీసీసీ పాలసీని తీసుకొస్తున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోందని చెప్పారు. ఐటీ కంపెనీలకు సంబంధించిన కాంప్రహెన్సివ్ ఎకో సిస్టంను అభివృద్ధి చేయడంలో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని, అందుకే వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల వల్ల ఏర్పడబోయే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టామన్నారు. స్థానిక అవసరాలకు ఇబ్బంది తలెత్తకుండా డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాల్లోనూ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





