కవి మానసిక రూపసి అయితే సమగ్ర వీక్షణం తప్పకుండా జరిగి గట్టి కవిత్వం ప్రవాహినిలా బయటకొస్తుందని దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి మావాడు – మహ గట్టివాడు శీర్షికతో రాసిన ముందుమాటలో ఫ్రీవెర్స్ ఫ్రంట్ సారథి కుందుర్తి అభిప్రాయపడ్డారు. నిజమే తిలక్ అన్నట్టు కవిత్వం కన్నీటి జడిలో తడిసే దయాపారావతమై, ప్రజాశక్తు లవహించే విజయ ఐరావతమై సాగి కవిని చిరకాలం బ్రతికించి అతని కళా కరవాల ధగద్ధగ రవాలు కురిపిస్తూనే ఉండాలి. కవి అంతర్లీన భావాల్ని ప్రగాఢంగా వీచే కవిత్వం హృదయాల్ని పెనవేసుకుంటుందన్న మాటకు నిదర్శనంగా డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ కలం కురిసిన నానీలు నిలిచాయి. మనిషిని చుట్టుముట్టే బాధలు,వేదనలు, జన్మించి ఎదిగిన పల్లె మూలాలు, నగర యాంత్రిక జీవన ఘోష వంటి అంశాలను గర్భీకరించుకున్న ఈ కవిలోని భావ వీచికలు నానీల సుగంధం పేరిట పుస్తకంగా వెలువడ్డాయి.
నగరంలోని జీవన నరకయాతనను తొలి నానీలో హృదయ ద్రావకంగా చెబుతూ వర్షం తగ్గినా/ రోడ్లు ఉప్పొంగుతున్నాయే!/ బస్తీ వాసుల /కన్నీళ్ళు అవి అన్నారు. సరదా కోసం చదివినా సాహిత్యం విలువలను అందిస్తుందని ఒక నానీలో చెప్పారు. డబ్బు వాసన బిగించిన పిడికిలిని కూడా సడలింపచేస్తుంది అన్న నానీ నిశితాలోచనకు తెరతీస్తుంది. ఎన్నాళ్లుగానో మదిలో నానుతున్న భావాలు నానీలై ఆకుపచ్చగా మొలకెత్తాయన్న సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రపంచీకరణకు బాధితులు బహుజనులేనని తేల్చారు. ప్లాస్టిక్, ఇత్తడుల హోరులో మట్టిబండ చట్టు బండగా మారిందని కన్నీరొ లికారు. పథకాలు ఎన్నున్నా పేదరికం పేదలకు పాత గొంగడే అని ఖేదపడ్డారు . మార్కుల కోసం మాతృభాషకు మంగళం పాడొద్దన్నారు.
పంటను రైతు నీటితో కాక కన్నీటితో పండిరచే దురవస్థ దాపురించిందని వేదన చెందారు. నడక ప్రయోజనాన్ని ఒక నానీలో చెబుతూ నడక /మొదటి అడుగు భారం/ ఆఖరి గమ్యం/ అతి రమ్యం అన్నారు. ఈ దేహాలన్నీ మట్టి ముద్దలే అయినప్పుడు కులమతాల తూకం ఎందుకు అని నిలేసి ప్రశ్నించారు. పాట ప్రజల సొంతమన్నారు. గురుకుల విద్య ముందు కార్పొరేట్ వెలవెల పోయిందని చెప్పారు. అతను/ ఆచార్యుడే అనుకున్నాను/ నడుస్తున్న/ ప్రపంచ చరిత్ర అని గురువుకి నిర్వచన మిచ్చారు. వరి పంట వంగి నేలను ముద్దాడితే రైతు కష్టం యవ్వనమైందని అభివర్ణించారు. నిద్రపోని గోడ గడియారం లాంటి కవిత్వపు సహచర్యంలో తాను కూడా నిద్ర మరచిపోయానని చెప్పారు. కాలుతున్న పాత జ్ఞాపకాలు భోగిమంటలలో వెలుగయ్యాయని అన్నారు. సూర్యోదయం వణకే శరీరానికి, వాలిపోయే పంటలకు ఇంజక్షన్ వంటిదని తెలిపారు. మనుషులకే లాక్ డౌన్ నియమాలని, మనసులకు ఎక్కడైనా సడలింపు ఉంటుందని అన్నారు. ప్రపంచీకరణ చేసిన గాయంతో వడ్రంగి బాడిషే మొండి పోయిందని చెప్పారు.
మానవ బంధాలు ఆర్థిక బంధాలుగా సంపూర్ణంగా మారిపోయాయని పెళ్లి చూపులకు సంబంధించిన నానీలో స్పష్టతను ఇచ్చారు. బాధ కవిత్వమై విరబూసిందని అన్నారు. పరిశోధనలో కొత్త అంశాల ప్రస్తావన భావితరానికి దీవెనలాంటి మార్గదర్శనమని భావించారు. అందరి చేతుల్లోకి /సెల్ ఫోన్లు చేరాయి / ఇక మనిషి/ ఒంటరి జీవి అని సెల్ ఫోన్ ప్రభావాన్ని ఒక నానీలో వివరించారు. కరోనాతో రోడ్లు,జేబులు ఖాళీ అయ్యాయని మరొక నానీలో అన్నారు. హుస్సేన్ సాగర్ లో/ బుద్ధుడు నిల్చున్నాడు/ సంసారం/ ఈదలేక కాదు అన్న నానీ లోతుగా ఆలోచింపజేస్తుంది. దండంపై ఆరేసిన మనసు కవితల కన్నీటి బొట్లు కార్చిందని చెప్పారు. ఎక్కడ చూసినా /రైతు ఆత్మహత్యలే/ కలియుగం కాదిది / ఆకలి యుగం అని వర్తమాన దుస్థితిని చిత్రిక పట్టారు. ఓటు/ మన సామాజిక హక్కు/ ఎందరో జీవితాలకు /దిక్కు అని ప్రజల చేతిలోని ప్రజాస్వామ్య ఆయుధాన్ని నిర్వచించారు. పోటీ పరీక్షల/ కాలమిది/ పాలిటిక్స్ లో/ తండ్రికి కొడుకే పోటి అని నడుస్తున్న రాజకీయాన్ని నానీగా మలిచారు. రుమాలు/ రైతు ఆత్మగౌరవం/ దేహానికి, దేశానికి/ ఆత్మస్థైర్యం అన్న నానీ కవిలోని ద్రష్టను ఎరుకపరిచింది. రైతులను/ చంపుతుంది /సమ సమాజం కాదు/ గిట్టుబాటు లేని సమాజం అన్న నానీ రైతాంగ దోపిడీని ఎండగట్టింది. నిన్న క్యాలెండర్ మార్చా /మళ్లీ అవే అంకెలు!/బాధలు,బాధ్యతలే/ కొత్తవి!! అన్న నానీ కొత్త ఏడాదిపై జనాభిప్రాయాన్ని ప్రతిబింబించింది. పట్నంలో మనిషి బంధాలు లేని డబ్బున్న ఏకాకి అని చెప్పిన నానీ బంధాలలోనే ఏర్పడ్డ జీవన అగాధాన్ని తెలిపింది. బడిలోని బాల్యస్మృతుల్లాగా పాత పుస్తకాలు కూడా మధురమని చెప్పిన నానీ నాటి అపురూప బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది.
నానీ కవిత/ ఒక మిణు గురు/ చరుపే /దీని కొసమెరుపు అని నానీల విశిష్టతను వివరించారు. మనకు తిరిగి రానిది /సమయం/ వద్దన్నా వచ్చేది/ వృద్ధాప్యం అని జీవిత క్రమంలో వచ్చే అనివార్యమైన స్థితులను తెలిపారు. మనిషికి/ ఆభరణాలు కాస్త అందం /అంతర్గత గుణం/ శాశ్వత సౌందర్యం అని ఒక నానీ లో తేల్చారు. నిత్యం/ చేతిలో సెల్ ఫోన్/ గడియ రికాం లేదు /గవ్వ చేతికి రాదు అని ఇంకో నానీలో వాస్తవ స్థితిని వెలిబుచ్చారు. మెట్రో ప్రయాణంలో మనిషే కాదు ఆలోచనలు కూడా గాలిలో తేలుతాయని చెప్పారు. మనసుపెట్టి పనిచేస్తే ఫలితం మనవడి దాకా అందుతుందన్నారు. జంట నగరాలు ఇప్పుడు కాబోయే ఖర్చులతో మంట నగరాలు అని చెప్పారు. పల్లెల్లో పలకరింపులు బంధాలతో పోసే ఆయుష్షులు అని తెలిపారు . కవిత్వంలో గాఢత గట్టిదయినప్పుడు కవికి అభిమానుల వెల్లువ ఉంటుందన్నారు. కరోనా వేళ వృత్తికి విలనైనా అసలు హీరో సేవతో సోనూ సూదేనని ప్రశంసించారు. పుస్తకాలను అవపోసన పట్టి అంబేద్కర్లు బడి పిల్లలు అని అభివర్ణించారు . జీవితం/ సుఖదుఃఖాల డైరీ /ఎదురీదే వాడే/ అసలు మనిషి అని ఇంకో నానీలో చెప్పారు. అమాయకంగా కవిత్వం చెప్పి మనసుల్ని బంధించే కవులు సదా బాలకులు అన్నారు. ఆ ఊరి ఇండ్లన్నీ/ ఈ మేస్త్రీ కట్టినవే /ఏ ఇంట్లో/ తనకు చోటు లేదు అని చెప్పిన నానీ నిశితంగా ఆలోచింపజేస్తుంది. కులం వివక్షతతో కలం కలత చెందిందని అన్నారు.
నిండా మనుషులు ఉన్న ఇల్లు రంగస్థలం అని చెప్పారు. స్టేటస్ లో పెట్టి వదిలేసిన భావాలు పుస్తకమై విరబూసాయని ఆనందపడ్డారు. నిరుద్యోగుల వయస్సుల సూర్యుడు అస్తమిస్తున్నాడు అని వేదన చెందారు. నిత్య శ్వాసగా కవిత్వోదయం జరగాలన్నారు. గురువుల పాఠం బడి ఒడిలో సరిగా వినకపోతే కాలం గుణపాఠం చెప్తుందని ఒక నానీ లో తెలిపారు. బోలెడంత పబ్లిక్ తో ఆషాడపు ఆఫర్ బోనం అన్నారు. నామాలు చూసి చిట్టి కడితే అందరికీ పంగనామాలు పెట్టి పారిపోయాడని చెప్పిన నానీ చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాలు, దోపిడీని ప్రతిబింబించింది. పిల్లల కలయికతో పల్లెలోని ప్రతి ఇల్లు పండగకి నవ్వుతుం దన్నారు. కష్టపడి నాల్గు రాళ్లు వెనకేస్తే అవి కిడ్నీ రాళ్లు తీయడానికి ఖర్చు అయ్యాయన్న నానీ మనో వేదనను మోసుకొచ్చింది. విజయాన్ని రుచి చూపించిన అపజయానికి నమస్కారం పెట్టారు. గద్దర్ గుండె ఆగినా ఆ పాటకు మరణం లేదని నివాళి అర్పించారు.
రవీంద్ర భారతిని సకల కళాత్మల కళానిలయమని ఆవిష్కరించారు. టీ కప్పులో తుఫాను అంటే టి 20 వరల్డ్ కప్పు మొదలవడం అన్నారు. చట్టసభల్లో /స్త్రీలకు గౌరవం దక్కింది/ చుట్టన్న జనంలోనే/ దక్కాల్సింది అని మహిళా సాధికారతను ప్రస్తావించారు. తల్లిని వదిలి వచ్చిన పిల్లలకు మరో తల్లి ఉస్మానియా విద్యా కేంద్రం అని ఒక నానీలో ప్రస్తుతించారు. తొలకరి చినుకులాంటి నానీలు పాఠకుల పఠనం తో తడిసి మొగ్గయి పూస్తాయని చెప్పారు. ఒక్కోసారి ఉల్లి /కన్నీళ్లు తెప్పిస్తుంది /కోస్తున్నందుకు కాదు /కొంటున్నందుకు అని అప్రతి హతంగా పెరిగి ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరల తీరును నానీ గా మలిచారు. ప్రణాళికా యుక్తమైన పరిశోధనాత్మక దృష్టి ఈ నానీల్లో కవి వైపు నుండి ప్రబలంగా వ్యక్తమైంది. గుండెలో గూడులో నిక్షిప్తమై అల్లుకుపోయి మాగిన భావాలకు సుగంధ మద్దుతూ అక్షరాలా జరిగిన కవిత్వీకరణమే ఈ నానీలు .
డా. తిరునగరి శ్రీనివాస్
9441464764





