తరిక్షంలో అద్భుతాలు సృష్టించే క్రమంలో అనేక ఆటుపోటులు ఎదురవుతాయి.వాటిని మొక్కవోని మనోధైర్యంతో అధిగమించింది సునీత విలియమ్స్, బూచ్ విల్ మోర్.వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతరిక్షంలో అద్భుతాలు తెలుసుకునేందుకుగాను చాలామంది ప్రయత్నాలు చేస్తారు.అలాంటి ప్రయత్నాల్లో అనేక సమస్యలు, అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి.తాము ప్రయాణించేటువంటి అంతరిక్ష నౌక లో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లయితే వ్యోమగాముల ప్రాణాలు సైతం పోతుంటాయి. అలాంటిది ఏమీ పట్టించుకోకుండా భవిష్యత్ తరాలకు అంతరిక్షంలో అద్భుత విజయాలను అందించడానికి మన శాస్త్రవేత్తలు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా వారు శ్రమిస్తూ,అంతరిక్ష సాహసికుల అద్భుత విజయాలు నుంచి నేటితరం స్ఫూర్తి పొందాలనేటువంటి ఉద్దేశ్యంతో ఒకరికి మించి మరొకరు, ఒక దేశానికి మించి మరొక దేశం నిరంతరం,నిత్యం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలో జీవించడానికి కృత్రిమ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని,అనుకూల పరిస్థితులు లేని చోట కూడా అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకొని అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షంలో జీవించాలంటే అక్కడ అనుకూల పరిస్థితులు ఉండవు. కాళ్లు, చేతులు శూన్యంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉంటాయి. వారికి సమాచారాన్ని పంపించడానికి గాను ఏర్పాట్లు ఉంటాయి.నిరంతరం చదువుకోవడానికి ల్యాప్ టాప్ లు, పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
వారు తినడానికి నిరంతరం ఇక్కడి నుండి పంపించడం జరుగుతుంది.నిద్రపోవడానికి స్లీపింగ్ బ్యాగులు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యం వారికి మనోధైర్యం అవసరం. ఇవన్నీ అనుకున్న సమయానికి వారికి చేరినట్లయితేనే వారు జీవించి ఉన్నారు అనే విషయం తెలుస్తుంది.వారికి చేరకపోతే వారు జీవించి లేరని విషయం మనం అర్థం చేసుకోవాలి.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ద్వారా వివిధ అవకాశాలు ఉండి పరిశోధనలు చేయడానికి గాను 2024 జూన్ 5న ప్రయోగించినటువంటి బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్ లో సునీతా విలియమ్స్, విల్మోర్లు ఐఏఎస్ఎస్ కు చేరుకున్నారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో చేరుకున్నారు.దానిలో తలెత్తిన సమస్యల కారణంగా తొమ్మిది నెలల బసగా మారింది.
వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా, స్పేస్ ఎక్స్ సహకారంతో 2025 మార్చి 15న క్రూ-10 మిషన్‌ను ప్రారంభించింది.వారు 286 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత 2025 మార్చి 18న భూమికి తిరిగి క్షేమంగా వచ్చారు.క్షేమంగా వచ్చారని అనుకుంటున్నాం కానీ వారు రికవరీ కావడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్న మాట.గురుత్వాకర్షణ లేని ప్రాంతంలో వారు ఉండడం వల్ల శారీరక సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎముకలు, గుండె,మెదడు రక్తప్రసరణ వ్యవస్థ పై కూడా ప్రభావం చూపుతాయి. అక్కడ నడవడం ఉండదు. కాబట్టి కండరాల క్షీణత వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వినికిడి లోపం, దృష్టి లోపం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో కోకిలర్స్ వ్యాధి కూడా రావచ్చు. వ్యోమగాముల పైన రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్,కేంద్ర నాడీ వ్యవస్థ కు సంబంధించినటువంటి సమస్యలు కూడా రావచ్చు. దాన్ని అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యోమగాములు గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి.
సునీత విలియమ్స్ 1998లో వ్యోమగామిగా ఎంపికై, 2006 లో అంతరిక్షంలో మొదటిసారి ప్రయాణం చేశారు. మొదటి ప్రయాణం డిసెంబర్ 2006లో స్పేస్ షటిల్ డిస్కవరీలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కి ప్రయాణించారు అప్పుడు 195 రోజులు యాత్ర చేశారు.రెండోసారి 2012లో ప్రయాణించి నాలుగు నెలల పాటు గడిపి అక్కడ 127 రోజులు ఉండి పరిశోధనలు చేశారు. మూడోసారి జూన్ 2024లో బోయింగ్ స్టార్లైన అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కి వెళ్లారు. ఇలా మూడు పర్యాయాలు విజయవంతంగా అంతరిక్షయానం చేసి విజయం సాధించినటువంటి వీర వనితగా, కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళగా ఆమె అందరి ప్రశంసలు పొందారు. ఇలా సాంకేతిక సమస్య కారణంగా 286 రోజులు అంతరిక్షంలో గడిపి, 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి, అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసినటువంటి మహిళగా చరిత్ర సృష్టించారు.
అనేక ఇబ్బందులను ఎదుర్కొని తొమ్మిది నెలల పాటు అక్కడ ఉన్నవారు ఇక రారు అనుకునేటువంటి సమయంలో క్రూ-10 మిషన్లో వెళ్లినటువంటి నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత విలియమ్స్ రాకకు మార్గము సుగమమైందని చెప్పవచ్చు. 60 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి సునీత విలియమ్స్ 63 సంవత్సరాల వయస్సున్న విల్మోరుతో కలిసి అంతరిక్షంలో పరిశోధనలు చేశారు. సాహసమే జీవితమనుకుని, గగన తలంపై పరిశోధనలే తన లక్ష్యంగా పెట్టుకుని, ప్రయాణంలో ఎదురైనటువంటి కష్టాలను, కన్నీళ్లను దిగమింగి అనుకున్న లక్ష్యాన్ని చేరిన ఓ మహిళ మార్గదర్శి సునీత విలియమ్స్. అందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి.భావితరాలకు ఆమె చరిత్రను ఒక పాఠ్యాంశంగా అందించాలి. అప్పుడే చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొంది,పరిశోధనలపై మక్కువ పెంచుకుంటారని ఆశిద్దాం.
– డాక్టర్ మోటె చిరంజీవి,
సామజిక వేత్త,విశ్లేషకులు.
సెల్ : 9949194327.