తలదించుకునే పనేం చేయలేదు
అవినీతి జరగని కేసులో ఏసీబీని రంగంలోకి దించడమేంటి?
అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు
కాళేశ్వరం గొప్పతనాన్ని రాష్ట్రమంతటా చాటాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కానీ తలదించుకునే పని చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా ఈ రేస్ గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి పారిపోయిండని విమర్శించారు. ఏసీబీ విచారణ తరువాత తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ సాహసించని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తానంటే రావడానికి రేవంత్ రెడ్డికి ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మొదటి సంవత్సరం ఫార్ములా రేస్ విజయవంతం కావడంతో రెండో సంవత్సరం కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగానే నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గ ఎలాంటి సమాధానం లేదన్నారు. అసలు అవినీతి జరగని కేసులో ఏసీబీని ఇన్వాల్వ్ చేయడాన్ని తన 26 సంవత్సరాల కెరీర్‌లో చూడనే లేదని మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. చిట్టినాయుడు రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే అటు తిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు అడిగారన్నారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్ చెయ్యాలని ఒత్తిడి ఉంటే బేషుగ్గా చేసుకోవచ్చని అధికారులకు చెప్పానన్న కేటీఆర్ అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్దమన్నారు. రూ.50 లక్షల డబ్బుల బ్యాగుతో లుచ్చా పని చేసి అడ్డంగా దొరికి నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి తమను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలన్న ఆలోచనతో ఉన్నాడన్నారు. అందులో భాగంగానే తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్ రావును కాళేశ్వరం కమిషన్ ముందుకు, తనను ఏసీబీ విచారణకు పిలుస్తున్నారని చెప్పారు. పెడితే 15 రోజులు తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడన్నారు. 2019 జూన్ 21 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరేళ్లు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కాంగ్రెస్ నాయకులను ఓడిరచడం మీద బీఆర్‌ఎస్ నాయకులు దృష్టి పెట్టాలన్నారు. పొద్దుటి నుంచి ఓపికగా తనకోసం ఎదురు చూసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రేవంత్ 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టాడన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలన్నారు. కేటీఆర్ ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా, ఈ ఫార్ములా రేసింగ్ కోసం అనేక రాష్ట్రాలు పోటీపడుతుంటే తన శక్తియుక్తులను ఉపయోగించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించమని తేల్చి చెబితే తెలంగాణలో నిర్వహించి ఈ దేశ పరువు, రాష్ట్ర పరువు తీశారంటూ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి కేటీఆర్ పై తప్పుడు కేసులు పెట్టి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కమీషన్లను ఎత్తిచూపితే కేసులు, లఘుచర్ల రైతులకు బేడీలేస్తే కేసులు, ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ భయపడడని, ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి అని హరీష్‌రావు అన్నారు.