జ్ఞాపకాల గిడ్డంగిలో… మతిమరపు ఒక వరం!

డా.సూర్యదేవర రామకృష్ణ ,మొబైల్ : 9490754169
అసలు నీకు బుర్ర ఉందా లేదా? చెప్పిన ముక్క గుర్తుండదు, అంతా మతిమరపు! చిన్నప్పటి నుంచి ఇళ్లల్లో, స్కూళ్లల్లో, ఆఫీసుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వినే విసురు ఇది. మన సమాజంలో గుర్తుపెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన నైపుణ్యం, మేధస్సుకు కొలమానం. అదే సమయంలో మరచిపోవడం అనేది ఒక పెద్ద నేరం, బలహీనత, ఒక మానసిక లోపం. మార్కులు రావాలన్నా, ఆఫీసులో బాస్ మెప్పు పొందాలన్నా డైరీ లాంటి జ్ఞాపకశక్తి ఉండాలనేది జగమెరిగిన సత్యం. కానీ, కాస్త నిదానించి ఆలోచిద్దాం. నిజంగానే మతిమరపు అంత శాపమా? మనం ఏదైనా మర్చిపోతున్నామంటే అది మన మెదడు పనికిరాకుండా పోతోందనడానికి సంకేతమా? లేక మనకు తెలియకుండానే మన బుర్ర మన మేలు కోసం చేస్తున్న ఒక అద్భుతమైన సర్జరీనా? సైన్స్ చెబుతున్న ఆసక్తికరమైన నిజాలేంటో ఈ  ప్రత్యేక కథనంలో చూద్దాం.
    మనలో చాలామంది మెదడును ఒక అపరిమితమైన స్టోరేజ్ స్పేస్ ఉన్న నిల్వ గిడ్డంగిలానో, లేదా ఒక కంప్యూటర్ హార్డ్ డిస్క్ లానో ఊహించుకుంటారు. అందులో ఏ సమాచారం వేసినా అలా పేరుకుపోతూ ఉండాలని, ఎప్పుడు క్లిక్ చేస్తే అప్పుడు బయటకు రావాలని ఆశిస్తారు. కానీ, ఆధునిక నాడీశాస్త్ర పరిశోధనలు ఈ పాత నమ్మకాన్ని పూర్తిగా కొట్టేస్తున్నాయి. మెదడు అనేది ఒక సజీవమైన, నిరంతరం మారుతూ ఉండే ఒక డైనమిక్ వ్యవస్థ. మనం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వేలాది దృశ్యాలు, వందలాది మాటలు, రకరకాల అనుభవాలను ఎదుర్కొంటాం.
వీటన్నింటినీ గనక మెదడు శాశ్వతంగా దాచిపెట్టడం మొదలుపెడితే, కొద్ది రోజుల్లోనే అది సమాచార విస్ఫోటనంతో నిండిపోయి మొరాయించడం ఖాయం. అందుకే, మన ప్రమేయం లేకుండానే మెదడు ఒక అద్భుతమైన వడపోత వ్యవస్థను నడుపుతుంది. ఏది అవసరమో ఉంచి, ఏది అనవసరమో దాన్ని తుడిచేసే ఈ ప్రక్రియలోనే మతిమరపు జన్మిస్తుంది. కెనడాలోని ప్రఖ్యాత టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనాల ప్రకారం మతిమరపు అనేది జ్ఞాపకశక్తి వైఫల్యం ఎంతమాత్రం కాదు. అది జ్ఞాపకశక్తి సజావుగా పనిచేయడానికి తోడ్పడే ఒక కీలకమైన భాగస్వామి. పాతబడిన, ప్రస్తుత జీవన విధానానికి పనికిరాని సమాచారాన్ని మెదడు కావాలనే పక్కకు నెట్టేస్తుంది. అలా చేయడం వల్లే కొత్తగా వచ్చే సమాచారానికి, సరికొత్త ఆలోచనలకు బుర్రలో తగినంత స్థలం దొరుకుతుంది. అంటే, పాత ఫైళ్లను డిలీట్ చేస్తేనే కదా కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోగలం! దీనికో చిన్న ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లినప్పుడు మీ బైక్‌నో, కారునో పార్కింగ్ లాట్‌లో ఒకే చోట పార్క్ చేయరు కదా, రోజుకో ఖాలీ  ప్లేస్‌లో పెడతారు. ఈరోజు వాహనం ఎక్కడ పెట్టారో మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. కానీ, సరిగ్గా నెల రోజుల క్రితం, ఇదే రోజున ఏ మూలన పార్క్ చేశారో గుర్తుంటుందా? ఖచ్చితంగా గుర్తుండదు. దీన్ని మతిమరపు అని ఏడవాలా? కాదు, ఇది మెదడుకు ఉన్న అసలైన తెలివితేటలు. ఒకవేళ గత నెల రోజుల్లో పార్క్ చేసిన ముప్పై ప్రదేశాలూ మీ బుర్రలో స్పష్టంగా తిరుగుతూ ఉంటే, ఈరోజు పార్క్ చేసిన చోటును వెతుక్కోవడం మీకు నరకంగా మారుతుంది.
    పాత సమాచారం వచ్చి కొత్త సమాచారాన్ని గందరగోళానికి గురిచేయకుండా ఉండడానికే మెదడు ఆ పాత విషయాలను తుడిచేస్తుంది.భాషలు నేర్చుకునే పిల్లలను గమనించినా ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చిన్న పిల్ల ఏదైనా ఒక పదాన్ని తప్పుగా పలికినప్పుడు, దాన్ని సరిదిద్దాలంటే ముందు ఆ పాత తప్పు ఉచ్చారణను వదిలించుకోవాలి (మరచిపోవాలి). పాత అలవాటును పూర్తిగా తుడిచేయకుండా కొత్త నైపుణ్యాన్ని వంటబట్టించుకోవడం ఎవరికైనా అసాధ్యం. ఇది కేవలం భాషకే కాదు, క్రీడలు, సంగీతం, డాన్స్ లేదా కోడింగ్ వంటి ఏ నైపుణ్యానికైనా వర్తిస్తుంది. పాత తప్పుడు పద్ధతిని ఎంత త్వరగా మర్చిపోతే, కొత్త సరైన పద్ధతి అంత వేగంగా మెదడులో బలపడుతుంది. మతిమరపు అనేది కేవలం చదువుకో, ఆఫీసు పనులకో పరిమితమైనది కాదు. మన భావోద్వేగ రక్షణకు, మానసిక ఆరోగ్యానికి ఇదొక పెద్ద వరం. జీవితంలో అందరికీ అన్నీ మంచి రోజులే ఉండవు. అవమానాలు, ఘోరమైన పరాజయాలు, నమ్మకద్రోహాలు, అత్యంత ప్రియమైన వారిని కోల్పోవడం వంటి గుండె కోత మిగిల్చే సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. ఒకవేళ ఆ బాధాకరమైన అనుభవాల తీవ్రత, ఆ క్షణంలో అనుభవించిన నరకం అణువణువూ ప్రతిరోజూ అలాగే తాజాగా గుర్తుంటే, ఏ మనిషీ పిచ్చివాడు కాకుండా బతకలేడు.
కాలక్రమేణా ఆ గాయాల తీవ్రత తగ్గి, జ్ఞాపకాలు మసకబారడం వల్లే మనం మళ్లీ నవ్వి, నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నాం.మనస్తత్వ శాస్త్రవేత్తలు దీన్ని అనుకూల మతిమరపు అని పిలుస్తారు. ఇది మన మనసుకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన అనస్థీషియా. బాధను పూర్తిగా తుడిచేయకపోయినా, దాని పదునును తగ్గించి మనల్ని మానసికంగా కుంగిపోకుండా రక్షిస్తుంది.  గతంలో జరిగిన తప్పులనే పదే పదే తలుచుకుంటూ కూర్చునేవాడు ఎప్పటికీ కొత్త అవకాశాలను అందుకోలేడు. కొంతమేర మతిమరపు ఉన్నవారే వైఫల్యాల నుంచి త్వరగా కోలుకుని, మళ్లీ ఫ్రెష్‌గా ప్రయత్నాన్ని మొదలుపెడతారు. దీన్నే మనం సైకలాజికల్ టర్మ్స్‌లో రెసిలియన్స్ (మానసిక స్థితిస్థాపకత) అంటాం. ఆ స్థితిస్థాపకతకు అసలైన పునాది ఈ మతిమరపే! దురదృష్టవశాత్తూ, మన దేశంలోని విద్యావ్యవస్థ ఇప్పటికీ ఎవడు ఎంత ఎక్కువ బట్టీ పట్టి గుర్తుంచుకుంటే వాడు అంత తోపు అనే పాతకాలపు భావన చుట్టూనే తిరుగుతోంది. పరీక్షల హాల్‌లో పుస్తకాల్లోని సమాచారాన్ని దించేసేవారే ఇక్కడ టాపర్లు. కానీ, నిజమైన విద్య అంటే సమాచారాన్ని తలకెక్కించుకోవడం కాదు, అవసరమైనప్పుడు దాన్ని వాడగలగడం, అనవసరమైన దాన్ని వదిలేయగలగడం.
    విద్యార్థులు ఒక కాన్సెప్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, వారు కొత్తగా నేర్చుకోవాలంటే పాత తప్పుడు ఆలోచనను అన్‌లర్న్ చేయాలి, అంటే మర్చిపోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ లాజిక్‌ను అర్థం చేసుకుంటే, పిల్లలపై అన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలి అనే అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది.అతి సర్వత్ర వర్జయేత్ అతిగా మర్చిపోవడం కచ్చితంగా సమస్యే. ఆఫీసులో ప్రెజెంటేషన్ మర్చిపోవడం, ఇంట్లో భార్య చెప్పిన వస్తువులు మర్చిపోవడం, లేదా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు నిజంగానే ఇబ్బందికరమైనవి. కానీ, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది సహజమైన, ఆరోగ్యకరమైన మతిమరపు గురించి. ఇది మెదడు తనను తాను క్లీన్ చేసుకునే ఒక తెలివైన శానిటైజేషన్ ప్రక్రియ.ప్రతి చిన్న విషయాన్ని బుర్రలో దాచుకోవాలని తపన పడే కన్నా, ఏది జీవితానికి ముఖ్యమో దాన్ని గుండెల్లో పదిలపరుచుకుని, మిగిలిన పనికిరాని చెత్తను వదిలేయడమే నిజమైన జ్ఞానం. మతిమరపు అనేది జ్ఞాపకశక్తికి శత్రువు కాదు, అది దానికి వెన్నెముక లాంటి ఆప్తమిత్రుడు. అది గతం అనే జైలు నుంచి మనల్ని విడుదల చేసి, వర్తమానంలో స్వేచ్ఛగా బతికేలా చేస్తుంది. కాబట్టి, నెక్స్ట్ టైమ్ మీరేదైనా చిన్న విషయం మర్చిపోతే తల బాదుకోకండి. నా బుర్ర నాకోసం ఏదో అన్‌వాంటెడ్ ఫైల్‌ను డిలీట్ చేస్తోంది అని మనస్ఫూర్తిగా నవ్వుకోండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *