హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా పంటలకు వచ్చే చీడపీడలు, రసం పీల్చే పురుగులను ముందస్తుగానే గుర్తించి వాటిని మొదట్లోనే నిరోధించే విధంగా తమ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీ గురించి కృషివాస్ సంస్థ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వివరించారు. పంట బయటకు కనిపించే వాటినే కాకుండా పంట అంతర్గతంగా ఉన్న రోగాన్ని కూడా గుర్తించి దానికి నివారణ చర్యలు కూడా సిఫార్సు చేస్తుందని చెప్పారు. పలు దఫాలుగా నిర్వహించిన సమావేశాలలో సంస్థ యాప్‌లో చేయాల్సిన మార్పుల గురించి మంత్రి తుమ్మల సలహాలు, సూచనలు ఇచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. తదనుగుణంగా కృషివాస్ సంస్థ తమ యాప్‌లో మార్పులు చేసుకొని ఫీల్డులో పరిశీలించిన అనంతరం సచివాలయంలో మంత్రి తుమ్మలతో కృషివాస్ ప్రతినిధులు శనివారం సమావేశయమయ్యారు. పొలంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మొక్కకు తెగులు సోకిందో ముందుగానే గుర్తించి దానికి పిచికారి చేయాల్సిన మందును కూడా ఈ టెక్నాలజీ తెలియజేస్తుందన్నారు. దీంతో సంబందిత రైతు ఆ మందును పిచికారి చేసి సరైన సమయానికి పంటలను సంరక్షించుకోవచ్చని, అసలు పొలం దగ్గరకి వెళ్లకుండా కూడా ఈ యాప్ ద్వారా పంట స్థితిగతులను తెలుసుకోవచ్చని మంత్రికి తెలియజేశారు. రైతు పంట ఎంత వేశారు, ఎన్ని ఎకరాలలో వేశారు అన్న డేటా కూడా రియల్ టైంలో వ్యవసాయ అధికారులకు లభిస్తుందన్నారు. ఎక్కడైతే తెగుళ్ళు ఏర్పడతాయో దానిని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం వల్ల రైతులు మిగతా పొలానికి తెగులు ఏర్పడకుండా నివారించి, తక్కువ కూలి ఖర్చుతో అధిక దిగుబడి పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా 60కు పైగా పంటలను (పత్తి, మొక్కజొన్న, వరి, మిరప, కూరగాయలు, ఆయిల్‌పామ్, ఇంకా ఎన్నో రకాల పంటలు) పరీక్షించించే విధంగా అవకాశం ఉందన్నారు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, కృషి వికాస్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఇలాంటి యాప్‌ల వినియోగం వల్ల రైతుల విలువైన సమయం ఆదా అవడంతోపాటు, రైతులు తమ పంటలకు ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ
