పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో ఘటన
పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూన్ 30: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిదిమంది కార్మికులు చనిపోయారు. వీరిలో ఐదుగురు సంఘటన స్థలంలో, ముగ్గురు హాస్పటల్‌లో మృతిచెందారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో 28మంది కార్మికులు అస్వస్థతకు గురవ్వగా వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ పరితోష్ పంకజ్‌లు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు.
కార్మికులను ఆదుకోండి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
కార్మికుల కుటుంబాలకు కిషన్ రెడ్డి సానుభూతి
పాశమైలారంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్పందించారు. ఈ ఘటన విచారకరమని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు కేంద్ర ఏజెన్సీలు సంపూర్ణ సహకారం అందించాలని ఆదేశించారు.
కెటీఆర్, హరీష్‌రావు , కవిత దిగ్భ్రాంతి
ఈ అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావులు దిభ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకోవడం విషాదకరమన్నారు. కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా కోరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.