- ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్
- ఏడుగురు మావోయిస్టులు మృతి
ఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్న దండకారణ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగడంతో అభయారణ్యం మొత్తం తుపాకీ బాంబుల చెప్పులతో దద్దరిల్లిపోయింది. ఈ ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గ్రేహౌండ్స్, నక్సల్స్ స్క్వాడ్ సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని చల్పాక గ్రామానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న పూలకమ్మ గుంపు సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోపోలీసులకు మావోయిస్టులు ఎదురుపడగా, పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో తిరిగి ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసుల తూటాలకు ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా, మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారు. ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), ఏటూరునాగారం మహదేశ్‌పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) ఉన్నారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతి చెందిన మావోయిస్టులలో ఒకరు తెలంగాణ వాసి కాగా, మరో ఆరుగురు ఛత్తీస్‌గఢ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల మూడు గ్రామాల ప్రజలకు తుపాకుల మోత వినబడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటన స్థలాన్ని ములుగు ఎస్పీ శబరిష్ సుమారు 3 గంటల పాటు పరిశీలించారు. సంఘటన స్థలానికి పోలీసులు ఎవరినీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో మావోయిస్టులు వంటకు ఉపయోగించిన వంట సామగ్రి, మావోయిస్టుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా దవాఖానకు తరలించారు. గత 7 సంవత్సరాల క్రితం ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్ కాగా ఏడు సంవత్సరాల తర్వాత మరో ఎన్‌కౌంటర్ జరగడంతో ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. — జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి వెళ్లిన తర్వాత 11:47 నిమిషాలకు 2 రౌండ్లు కాల్పులు జరగగా,11:49 నిమిషాలకు మరో 2 రౌండ్లు కాల్పులు జరిగాయి.12:15 నిమిషాలకు మరో 3 రౌండ్లు కాల్పులు జరగడంతో అసలు ఏం జరుగుతుందనే సందిగ్ధంలో గ్రామస్తులు ఉన్నారు. తెలంగాణలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
ఈ ఎన్‌కౌంటర్ తో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పిఎల్ జిఏ (పీపుల్స్ అండ్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలవుతుండగా ఈనెల 2 నుంచి 8 వరకు పిఎల్ జిఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చింది. దీనికి ఒకరోజు ముందు జరిగిన ఎన్‌కౌంటర్ తో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. గత మూడు నెలల క్రితం కొత్తగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో లచ్చన్న దళ మావోయిస్టులు ఆరుగురు మృతి చెందారు. ఈరోజు జరిగిన ఎదురు కాల్పులలో భద్రన్నదళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది అనే చెప్పవచ్చు.
తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు బాగా తగ్గిపోయాయి. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. సెప్టెంబర్‌లో ఆరుగురు, ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందటం నక్సల్స్‌కు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు హతమయ్యాడు. మెుత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 250కు పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.