- ఆదాయం పెంచే సత్తా ప్రభుత్వానికి లేదు..
- గత అప్పులను ఎక్కువ చేసి చెబుతున్నారు..
- మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : ఏడాదిగా కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని, ఎవరూ మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నడు. మీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలి కానీ మీరు కాదు.. మీ అపరిపక్వత, మీ అసమర్థత, నీ ప్రతికూల వైఖరి వల్ల రాష్ట్రంలో నేడు అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. మేము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, మీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వొచ్చినట్లు రేవంత్ వాగుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తుశుద్ది లేదు. ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ము లేదు. కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లా ఉంది. ఏడు లక్షల కోట్ల అప్పు అని ఏడాది కాలం నుంచి చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అబద్దాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటారు.
గోబెల్స్ ను మించిన రేబెల్స్ ప్రచారం మీది అని మండిపడ్డారు. గత ప్రభుత్వం దాచిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. అప్పులు బహిరంగ రహస్యమే. గణాంకాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. ప్రతీ ఏటా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లో ఉంటాయి. ఆనాడు సీఎల్పీ లీడర్ గా ఉన్న భట్టి విక్రమార్కకి రాష్ట్ర అప్పులు ఎంతో, ఆదాయం ఎంతో తెలియదా. అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 4,26,499 కోట్లు అని అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా నిరూపించాను. ఇప్పటికీ అదే సవాల్ చేస్తున్నాను.
నా వాదనలో సత్యం ఉంది. సత్యాన్ని ఎదుర్కునే శక్తి నీకు లేదు. ఆర్థిక మంత్రికి లేదు. ఏ ఛానల్ వేదికగా కూర్చుందాం, ఏ ఆర్థిక నిపుణులతో కూర్చుందామో చెప్పు అనిసవాల్ విసిరారు. మీపేరే ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు బంధును ఎవరు ఎగ్గొట్టారో ప్రజలకు తెలియదా? మోసం చేయడం మీకు అలవాటు, మోస పోవుడు ప్రజలకు అలవాటు అనే కదా నీ నమ్మకం.. గత ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం 7,200 కోట్ల నిధులు సిద్ధం చేసి రైతుల ఖాతాల్లో వేసేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం తెల్లవారితే ఖాతాల్లో వేస్తామని తొర్రూరు సభలో స్వయంగా నేనే ప్రకటించాను. రైతు బంధు ఖాతాల్లో పడితే నీకు వోట్లు డబ్బాలో పడవని భయమై, దుర్మార్గంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు ఆపింది మీరేనని అన్నారు.
ఇప్పుడైతే 10వేలు, మేమొస్తే 15వేలు అని రైతులను ఊరించి, నమ్మించి వోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడివి అని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు మేము నిలదీస్తే విధిలేక మేము సిద్ధం చేసిన నిధులతో రైతుల ఖాతాల్లో 5వేలే వేశారు. 7500 ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.అబద్దానికి అంగీ లాగు వేస్తే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కనే ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.వరుసగా రెండేళ్లు కొవిడ్ వొచ్చి రాష్ట్ర పరిస్థితి అతలాకుతలం అయిపోయినా కేసీఆర్ రైతు బంధును ఆపలేదని చెప్పారు. తమ హయాంలో మొత్తం 11 విడతల్లో 72,815 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు.ఆరు నూరైనా రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా, ఏడాదిలోనే చేతులెత్తేసిన నువ్వెక్కడ అని ప్రశ్నించారు. కేసీఆర్ పేరు ఉచ్చరించే నైతికత కూడా రేవంత్ కు లేదని హరీష్ రావు అన్నారు.