నిధులు లేక కుంటుప‌డ్డ గ్రామ పాల‌న‌

– పారిశుద్ధ్యం కుంటుప‌డింది
-ట్రాక్ట‌ర్లు ప‌క్క‌న పెట్టేశారు
– సెల‌వుల‌పై వెళుతున్న పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు
– ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు ధ్వ‌జం

పెట్రోల్ పంపు వాళ్ళు డీజిల్ ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి తెచ్చావు క‌దా రేవంత్ రెడ్డీ అంటూ హ‌రీష్‌రావు ఎద్దేవా చేశారు. బుధ‌వారం ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకుంటే గ్రామ పాలన ఎలా సాధ్యమవుతుంది. ప్ర‌భుత్వ‌ చేతగానితనం పంచాయతీ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి శాపంగా మారుతున్నద‌న్నారు .కేసీఆర్ గ్రామ పంచాయతీలను దేశం గర్వించే దిశగా తీర్చిదిద్దితే, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు కునారిల్లుతు న్నాయ‌న్నారు .పంచాయతీల సంఖ్యను 12,941 కి చేర్చి, ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను కె.సి.ఆర్‌. నిలిపార‌ని గుర్తుచేశారు. నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడింది. నెల నెలా నిధులు విడుద‌ల చేయ‌కుండా నిర్వహణను గాలికి వదిలి వేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయ‌న్నారు.

చివరకు ట్రాక్టర్ల లో డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. కొన్ని చోట్ల అధికారులు మూలకు పెట్టారు, మరికొన్ని చోట్ల వారం, మూడు రోజులకు ఒకసారి నడుపుతున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చ‌న్నారు. కాలిపోయిన వీధి దీపాలు మార్చడానికి నిధులు లేక గ్రామాలు చీకటిమయం అవుతున్నాయ‌న్నారు. సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు చెయ్యలేక, ఆ ఆర్థిక భారాన్ని మోయలేక పంచాయతీ కార్య‌ద‌ర్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టే దుస్థితి దాపురించింద‌న్నారు. ప్ర‌తి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామ‌ని గొప్ప‌లు చెప్పుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఆరోపించారు .పంచాయతీల్లో పారిశుద్ద్య నిర్వహణ సహా అనేక ముఖ్యమైన విధుల్లో నిత్యం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు రెండు నెలల జీతాలు అందక నిరసన వ్యక్తం చేస్తున్నార‌ని గుర్తుచేశారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వానాకాలం ప్రారంభంలోనే ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించేది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టేది.కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్పెషల్ డ్రైవ్ లు పక్కన పెడితే ఉన్న పనులు కూడా చేయడం లేదు. అవసరమైన నిధులు విడుదల చేయడం లేద‌ని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో పంచాయతీలకు నెల నెలా రూ. 275 కోట్ల జీపీ నిధులు విడుద‌ల చేశాం. మొత్తంగా ఏటా రూ. 3330 కోట్లు ఇచ్చాం.ప‌ట్ట‌ణాల పారిశుద్య నిర్వహణ కోసం ప్ర‌తి ఏడాది అదనంగా రూ. 1700 కోట్లు ఖ‌ర్చు చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నద‌న్నారు. పాలన గాలికి వదిలేసి ముగ్గురు మంత్రులకు పోర్టు ఫోలియోలు కేటాయించేందుకు మూడురోజులుగా ఢిల్లీలో తీష్ట వేశావు. .ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని, పాడై పోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page