- ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
- ప్రైవేటు సెక్టారులో లక్షన్నర ఉద్యోగాలు మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణాలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా బీఆరెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. యువతకు ఉపాధి దొరకకుండా చేయాలన్నదే వారి దుర్మార్గపు ఆలోచనగా కనిపిస్తోందని బుధవారం నాడు ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రైవేటు సెక్టారులో లక్షన్నర ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. పరోక్షంగా మరో లక్ష మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గులాబీ పార్టీ కళవర పడుతోందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకాలు సృష్టిస్తూ రైతులను రెచ్చగొడ్తోందని శ్రీధర్ బాబు అన్నారు. అరాచకం సృష్టించాలని చూస్తే ప్రభుత్వ యంత్రాంగాలు చూస్తూ ఊరుకోవని ఆయన హెచ్చరించారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్పల్పకాలంలోనే రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యం స్థానంగా మార్చించదని ఆయన తెలిపారు.
గతంలో నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత వల్ల పరిశ్రమలు రావడానికి వెనకాడేవి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో చదువులకు, ఇండస్ట్రీకి మధ్య ఉన్న నైపుణ్యాలకు సంబంధించిన గ్యాపును పూరిస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతి నిరుద్యోగి ఏదో ఒక స్కిల్ లో శిక్షణ పొందేలా ప్రభుత్వం జిల్లాల స్థాయిలో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. “మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ పరిశ్రమలను, అభివృద్ధి కార్యక్రమాలను వ్యతిరేకించలేదు. రాష్ట్రాభివృద్ధి జరగాలని కోరుకున్నాం. అప్పటి ఒప్పందాలకు అభ్యంతరాలు చెప్పకుండా పెద్ద మనసుతో కొనసాగిస్తున్నాం. రోజు రోజుకు ఉనికి కోల్పోతున్న బీఆరెస్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రైతులను రెచ్చగొడ్తోంది. 2025-26 నాటికి పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమల అనుమతులకు సంబంధించి విధివిధానాలు జారీ చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా కేంద్ర నిర్ణయం మేరకు ఏర్పాటవుతోంది. దానికి అనుమతులు కూడా కేంద్రం ఇచ్చినవే. భూములు పరిశ్రమ వారే సొంతంగా కొనుక్కునారు. నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే స్థానిక యువతకు ఉద్యోగాలు దొరికి ఆ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. పారిశ్రామిక ప్రగతికి ఆటంకాలు కల్పించుకుంటూ పోతే ఆ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. విధ్యంస కార్యక్రమాలతో ఏపార్టీ మనుగడ సాగించలేదు. గత ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని రాష్ట్రాభివృద్దికి సహకరిస్తే తప్ప ప్రజా మద్ధతు దొరకదు”..అని మంత్రి శ్రీధర్ బాబు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.