కాంగ్రెస్‌ పాల‌న‌లో దిగజారిన గురుకులాల పరిస్థితులు

– ఇప్పటివరకు వందమంది విద్యార్థుల మృతి
– బీఆర్‌ఎస్‌ హయాంలో పురోగతి
– అయినా స్పందించని సర్కార్‌: కేటీఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బీఆర్‌ఎస్‌ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. అదే కాంగ్రెస్‌ పాలనలో గురుకుల పాఠశాలలస్థాయి దిగజారిందని ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. రెండేండ్లలో వందమందికిపైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు. విద్యార్థుల మరణాలపై కాంగ్రెస్‌ సర్కార్‌ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వర్షిత (15) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదంటూ మండిపడ్డారు. సానుభూతి, జవాబుదారీతనం అసలే లేవని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌ మండలం రాంపూర్‌కు చెందిన మమత, తిరుపతి దంపతుల కుమార్తె శ్రీవర్షిత (15) వంగరలోని పీవీ రంగారావు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. దీపావళి సెలవులకు వెళ్లిన ఆమె ఈ నెల 23న తిరిగి పాఠశాలకు వచ్చింది. 24న పాఠశాల సిబ్బంది సెల్‌ఫోన్‌ నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నారని, తనను వెంటనే తీసుకెళ్లాలని, ఇక్కడ ఉండలేనని మొరపెట్టుకున్నది. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నట్టు బదులిచ్చారు. ప్రార్థనా సమయంలో విద్యార్థులంతా బయటకు రాగా శ్రీవర్షిత కనిపించలేదు. దీంతో డార్మెటరీకి వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకొని విగత జీవిలా కనిపించింది. మృతదేహాన్ని అంబులెన్సులో కాకుండా ట్రాక్టర్‌లో తరలించడం తోటి విద్యార్థినులతోపాటు అందరినీ కలచివేసిందంటూ విద్యార్థినులు రోదిస్తున్న వీడియోను కేటీఆర్‌ పోస్టు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page