తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయత్నం ఈ ఛాయా లిటరరీ ఫెస్టివల్. ప్రతి యేడాది ఈ ఫెస్టివల్ జరపాలని ఛాయ పబ్లిషర్స్ అనుకోవడం, తెలుగు సాహిత్యానికి గొప్పమేలు చేయడమే. తెలుగు సాహిత్యానికి, ఇతర భాషాసాహిత్యాలకూ ఇదొక వారధి. ఈ సందర్భంగా, ఈ లిటరరీ ఫెస్టివల్‌లో మాట్లాడుకోవావాల్సిన, చర్చకు రావాల్సిన విషయాలున్నాయి. ఇతరభాషల నుండి తెలుగులోకి అనువాదమవుతున్నంత స్థాయిలో, తెలుగురచనలు ఇతరభాషల్లోకి పోవడంలేదు. తెలుగు పబ్లిషర్స్ ఇతరభాషల పుస్తకాలు అనువాదం చేయించి ప్రచురించినట్లే, తెలుగునుండి కూడా అనువాదాలు పోవడానికి ఇతరభాషల పబ్లిషర్స్‌తో వారధిగా యేర్పాటవాలి.
నిర్వీర్యమైన అకాడమీలకు ఫండ్స్ కేటాయించి పనిచేసేలా ప్రభుత్వాలపై రచయితలు, పబ్లిషర్స్ వత్తిడి తేవాలి. AI బెడద రచయితలకూ తప్పదు. వ్యాపారం తెలిసిన కొందరు తమలో సృజన లేకపోయినా, AI ద్వారా కృతకమైన రచనలు, కృతకమైన అనువాదాలు పుట్టిస్తారు. ఈ వ్యాపార రచయితల ధాటికి నిజమైన రచయితలు అడ్రస్ లేకుండా పోతారు. రచయితలకు రక్షణ యెలా? పబ్లిషర్స్ నిజాయితీగా నిజమైన రచయితలను ప్రోత్సహించాలి. ఈ పరిస్థితి మారితే తప్ప, మంచి రచనలు మార్కెట్‌లోకి, ఇతర భాషల్లోకి పోయి తెలుగు రచనలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించదు.
పాలగిరి విశ్వప్రసాద్





