అక్టోబర్ 25 నాడు హైదరాబాదులో జరగనున్న ‘ఛాయా లిటరేచర్ ఫెస్టివల్’ తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్పు. తెలుగు, ఉర్దూ, తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యరంగంలోని ప్రముఖకవులు, రచయితలు ఒకేవేదికగా భాగం పంచుకోవడం, వారితో పాఠకుల పరస్పర ఇంటరాక్షన్ ద్వారా, దేశంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాల పట్ల ఆయారచయితలకున్న దృక్పథాలు, అవి వారిసాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నయన్న విషయాల అవగాహన ఏర్పడుతుంది. ఒకనాటి అలంపూర్ సాహిత్యోత్సవం, బుక్ ఫేర్ వేదికగా జరిగే సాహిత్య కార్యక్రమాలు, ఈ మధ్యనే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన లిటరరీ ఫెస్టివల్ లాంటివి కొన్ని జరిగినప్పటికీ, ప్రస్థుతం జరగనున్న ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ మొట్టమొదటి ఆధునిక తెలుగు సాహిత్యోత్సవంగా నిర్వాహకులు చెబుతున్నారు.
రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు, విక్రేతలు ఒకేవేదికవద్ద కలుసుకొని, సాహిత్యంలోని వివిధ అంశాలపట్ల గుణాత్మక చర్చచేయడం సాహిత్యరంగంలో ఆశించే గొప్పమార్పుకు సంకేతం. ముగింపు సమావేశంలో గోరటి వెంకన్న ప్రదర్శన, తెలుగు సాహిత్య, సాంస్కృతికరంగాల మేళవింపుకి చిహ్నం. ఈ ఉత్సవం యువకవులకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రపంచం చూపు తెలుగుసాహిత్యం వైపు నిలుస్తుంది. రచయితలు పాఠకుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది.
గాజోజు నాగభూషణం





