ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. మ‌నిషి ధ‌నం కోల్పోయినా ప‌ర‌వాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా క‌ష్టం. అనారోగ్యం పాలైన మ‌నిషి ఏ ప‌నీ చేయ‌లేడు. ఇది అత‌ని మ‌నుగ‌డ‌నే దెబ్బ‌తీ స్తుంది. కుటుంబ‌ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదే స‌మాజానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం దేశాభివృద్ధికి వెన్నెముక వంటిద‌నడంలో ఎంత‌మాత్రం సందేహం లేదు. దీన్ని గుర్తించిన ప్ర‌భుత్వాలు ప్ర‌జారోగ్యానికి నిధులు కేటాయించి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా అవి త‌గిన స్థాయిలో లేక‌పోవ‌డం విషాదం. ఆరోగ్య‌రంగంపై ప్ర‌భుత్వాలు పెట్టే పెట్టుబ‌డులు త‌గ్గుతుండ‌టం ఆందోళ‌నక‌ర ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక‌వైపు ప‌న్నులు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెంచుతున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు ఇదే స్థాయిలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెర‌గ‌డంలేదు స‌రిక‌దా త‌గ్గుతుండ‌టం విచిత్రం. 2017-18లో కేంద్రం మొత్తం బ‌డ్జెట్‌లో 2.4% ఈ రంగానికి కేటాయించ‌గా 2025-26 బ‌డ్జెట్‌లో 1.9%కు ప‌డిపోవ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. 2018లో కేంద్రం ఆరోగ్యం-విద్యాసెస్‌ను ప్ర‌వేశ పెట్ట‌డంతో దీని కింద రూ.1.21ల‌క్ష‌ల కోట్లు వ‌సూలయ్యాయి. ఒక‌వేళ ఈ సెస్ లేక‌పోతే ఆరోగ్య రంగంపై ప్ర‌భుత్వ ఖ‌ర్చు కేవ‌లం 1.3% మాత్ర‌మే ఉండేదని  నివేదిక‌లు తెలుపుతున్నాయి. ఈ రంగానికి బ‌డ్జెట్‌లో క్రమంగా పెరుగుతున్న కోత‌ల వ‌ల్ల‌ పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి వైద్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంది.

     దేశంలో అతిపెద్ద ఆరోగ్య ప‌థ‌కం, నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌కు 2020-21 నుంచి 2023-24 మ‌ధ్య‌కాలంలో ఏకంగా 22% కోత విధించ‌డం ఈ రంగంపై పెరుగుతున్న ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నం. కేవ‌లం విదేశీపెట్టుబ‌డులు, లాభాల వంటి వాటిపై  దృష్టి కేంద్రీక‌రించి, ఆరోగ్యంపై పెట్టుబ‌డిని నిర్ల‌క్ష్యం చేయ‌డం క‌చ్చితంగా దేశ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌క‌మాన‌దు. దీన్ని ప్ర‌భుత్వం గుర్తించి స‌రిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఉంది . దేశ స్థూల జాతీయోత్ప‌త్తి (జీడీపీ)లో ఆరోగ్య‌రంగం వాటా 2.4% ఉండాలని  జాతీయ ఆరోగ్య విధానం నిర్దేశిస్తోంది. 2026-27 బ‌డ్జెట్ కేటాయింపులు రూ.1.4ల‌క్ష‌ల కోట్లు ప‌రిశీలిస్తే ఈ ల‌క్ష్యానికి మ‌నం ఎంతో దూరంగా ఉన్నామ‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.
పోనీ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ లో సేవ‌లు ఏమైనా బాగున్నయా అంటే అదీ లేదు. నేను రాను బిడ్డో స‌ర్కారు దవాఖానకు  అనే విధంగా పాటలు పాడుకునే దుస్థితిలో ఉండటమొక దౌర్భాగ్యం.  ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల దుస్థితిని ఎం.పి. స్వాతి మ‌లీవాల్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌ముఖంగా ప్రస్తావించ‌డం గ‌మ‌నార్హం.  దీని ఫ‌లితంగా పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా ప్రైవేటు వైద్యాన్ని ఆశ్ర‌యించాల్సి వొస్తున్న‌ది. ఇవి వేసే బిల్లుల‌పై ఎటువంటి నియంత్ర‌ణ లేక‌పోవ‌డం, ఇన్యూరెన్స్ క్ల‌యిమ్‌ల క్లియ‌రెన్స్ లో ఇబ్బందులు వెరిసి సామాన్యుల వైద్యం క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి. చాలా క్లైములు క్యాష్‌లెస్ అయిన‌ప్ప‌టికీ, ఏదో నెపంతో రోగినుంచి డ‌బ్బులు ముక్కుపిండి వ‌సూలు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది.
ఇక మందుల ధ‌ర‌లు చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. 600% నుంచి 1000% వ‌ర‌కు మార్క‌స్ (అద‌న‌పు లాభం) విధించ‌డం దారుణం. సామాన్యుడు హాస్పిట‌ల్‌లో చేరి వైద్య‌సేవ‌లు అందుకున్న త‌ర్వాత వాళ్లు విధించే బిల్లులు ఒక బ్ర‌హ్మ‌ప‌దార్థం మాదిరిగా ఎంత‌కూ అర్థంకావు!  ఏ సేవ‌కు ఎంత చార్జ్ విధిస్తున్నారో రోగికి అర్థంకాదు. ఒక రోగికి స‌ర్జ‌రీకి ముందు చెప్పే ప్యాకేజీ ధ‌ర ఒక‌టి, తీరా డిశ్చార్జ్ అయి ఇంటికి పంపే స‌మ‌యంలో అద‌న‌పు సేవ‌ల‌ పేరుతో చేస్తున్న వ‌సూళ్లు రెట్టింపు వుండ‌టం మరీ దారుణం. అదీకాకుండా గ‌దుల అద్దె, న‌ర్సింగ్ చార్జీలు, క‌న్స‌ల్టేష‌న్ ఫీజులు సామాన్యుడి నెల‌వారీ ఆదాయం కంటే ఎక్కువ వుండ టం, వైద్యం పేరుతో దోపిడీ ఎంత‌టి తీవ్ర‌స్థాయిలో కొన‌సాగుతున్న‌దీ వెల్ల‌డిస్తుంది.
ఈ విధంగా ఎడాపెడా బాదే బిల్లులు, వొచ్చిన వ్యాధి క‌లిగించే వేద‌న‌కంటే మ‌రింత బాధ‌ను క‌లిగిస్తున్నాయి. ప్ర‌భుత్వ వైద్య‌రంగంపై ఒత్తిడి పెర‌గ‌డం, కేటాయింపులు త‌గ్గ‌డం వ‌ల్ల ప్రైవేటు హాస్పిటల్స్ పై ఆధార‌ప‌డాల్సి రావ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ప్ర‌స్తుతం దేశంలో 70%కు పైగా ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్రైవేటు రంగంలోనే ఉండటం, అవి లాభార్జ‌నే ధ్యేయంగా ప‌నిచేస్తుండ‌టంతో వైద్యం కోసం వెళ్లిన సామాన్యులు అప్పుల‌పాలు కావ‌డం జ‌రుగుతోంది. అదీ కాకుండా జెనెరిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మందులు ప్రిస్క్రిప్ష‌న్‌లో రాయ‌డం కూడా మందుల ఖ‌ర్చు త‌డిసి పోపెడ‌వుతోంది. వీటికితోడు అవ‌స‌రానికి మించి స్కానింగ్‌లతో పాటు వివిధ ర‌కాల ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌డం కూడా సామాన్యుల న‌డ్డి విరుస్తోంది.
ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర మందులు, చికిత్స‌ల‌పై ప్ర‌భుత్వం ధ‌ర‌ల ప‌రిమితి విధించాలి. ఈ చ‌ట్టాన్ని క‌ఠినంగా అమ‌లు చేయ‌డ‌మే కాదు, ప్ర‌తి హాస్పిట‌ల్‌ తాను అందించే వైద్య‌సేవ‌ల‌కు వ‌సూలు చేసే మొత్తాల‌ను ప‌ట్టిక రూపంలో ప్ర‌ద‌ర్శించ‌డం త‌ప్ప‌నిస‌రి చేయాలి. ప్రైవేటు హాస్పిట‌ళ్ల ఆడిటింగ్‌కు ప్ర‌త్యేక క‌మిటీల‌ను నియ‌మించాలి. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ వైద్య‌వ్య‌వ‌స్థను మ‌రింత బ‌లోపేతం చేయ‌డ‌మే ప్రైవేటు హాస్పిటల్స్  ఆగ‌డాల‌ను అరిక‌ట్టడానికి ఉత్త‌మ‌మార్గం. ప్ర‌భుత్వం మెరుగైన వైద్య‌సే వ‌లు అందిస్తే, ప్రైవేటు హాస్పిటల్స్  దారికొస్తాయి. ప్ర‌జారోగ్యం అనేది ప్రాథ‌మిక హ‌క్కుగా ప్ర‌భుత్వాలు గుర్తించాలి. అంతేకాని లాభాల‌తో కూడిన వ్యాపారంగా ప‌రిగ‌ణించ‌కూడ‌దు అన్న సగటు జీవి డిమాండ్ అరణ్యరోదనగా మిగిలిపోవడం విషాదకరం ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *