హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగులకు అండ

– 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోల పంపిణీ
– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : దివ్యాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంలో మరో కీలక అడుగు వేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికే స్ఫూర్తి అన్నారు. చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా సంకల్ప బలంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆమె ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. దివ్యాంగులను జాలి చూపాల్సిన వారిగా కాక సమాజాభివృద్ధిలో సమాన భాగస్వాములుగా చూడాలన్నదే ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులకు విద్య, ఉపాధి, పునరావాసం, జీవనోపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రెండు దశాబ్దాలుగా మహిళల సాధికారత కోసం విశేషంగా పనిచేస్తున్న ‘సెర్ప్‌’కు ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమ బాధ్యతలను కూడా అప్పగించిందని తెలిపారు. దివ్యాంగ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మహిళా సంఘ సభ్యులకు అప్పగించామన్నారు. ‘సెర్ప్‌’ సీఈవో దివ్యా దేవరాజన్, డైరెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తక్కువ కాలంలోనే దివ్యాంగులను సంఘటితం చేసి రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకుపైగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసినట్లు, ప్రస్తుతం 82 వేల మందికి పైగా సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్‌హుడ్ సెంటర్ల ద్వారా కమ్యూనిటీ మేనేజ్‌డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. నైబర్‌హుడ్ సెంటర్లలో దాదాపు మూడు వేల మంది దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్య, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలు అందుతున్నాయని వివరించారు. తల్లిదండ్రులకు శిక్షణ, కౌన్సెలింగ్‌తోపాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ-ఆటోలు కేవలం వాహనాలు కాదని, ఎన్నో కుటుంబాలకు ఆశను, దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని అందించే సాధనాలని మంత్రి పేర్కొన్నారు. రవాణా సమస్యల వల్ల పిల్లలను కేంద్రాలకు తీసుకురాలేకపోయిన కుటుంబాలకు ఇకపై ఇంటి వద్ద నుంచే ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యంగా ఆటిజం, మేధోవైకల్యం తదితర వైకల్యాలు ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా థెరపీ, శిక్షణ పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తే వారు అద్భుత విజయాలు సాధిస్తారని చెప్పారు. కళ్లు కనిపించకపోయినా బ్రెయిలీ ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకున్నవారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. పుట్టుకతో వచ్చిన వైకల్యాలను కూడా తల్లిదండ్రుల ప్రేమ, ప్రోత్సాహం, సరైన శిక్షణతో ఎంతోవరకు అధిగమించవచ్చని చెప్పారు. దివ్యాంగ పిల్లల గురించి కుటుంబీకులు నిరాశ చెందకుండా మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యమంత్రి సహకారంతో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి త్రిచక్ర వాహనాలు, జీవనోపాధి అవకాశాలు, స్వయం సహాయక సంఘాలు, నైబర్‌హుడ్ సెంటర్లు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల పేరిటే ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటూ వారికి సామాజిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. సీఎసఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తరఫున మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి దివ్యాంగుడికి సేవలు వారి ఇంటి సమీపంలోనే అందేలా నైబర్‌హుడ్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తామని, అవసరమైనచోట కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలను విస్తరిస్తామని మంత్రి ప్రకటించారు. దివ్యాంగులకు జాలి కాదు.. గౌరవం, సమాన అవకాశాలు, ఆదరణ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుదామని, అదే హెలెన్ కెల్లర్‌కు మనం అందించే నిజమైన నివాళి అని మంత్రి సీతక్క అన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ‘సెర్ప్‌’ సీఈవో దివ్య దేవరాజన్, ‘సెర్ప్‌’లో దివ్యాంగుల సంక్షేమ విభాగ డైరెక్టర్ ఎల్.కృష్ణమూర్తి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పీయూష్ మిట్టల్, కైలాష్, అధికారులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మా పిల్లలకు కొత్త జీవితం ఇచ్చిన‌ నైబర్‌హుడ్ కేంద్రాలు 

నైబర్‌హుడ్ కేంద్రాల గురించి మాట్లాడుతుండగా పలువురు తల్లులు భావోద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రాత్రింబవళ్లు ఆందోళన చెందామని, కానీ ఇప్పుడు అదే పిల్లలు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తమకు కొత్త ఆశలు కలిగాయని కన్నీటి పర్యంతమయ్యారు. రఘునాథపల్లి మండలానికి చెందిన మమత మాట్లాడుతూ ‘మా బాబు ముందు చిన్న పిల్లలు చేసే సాధారణ పనులు కూడా చేయలేకపోయేవాడు.. ఏ వస్తువునైనా చేతిలో పట్టుకోలేకపోయేవాడు.. కానీ మా ఊరిలో నైబర్‌హుడ్ సెంటర్ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ తీసుకెళ్లాం.. అక్కడ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ అందించారు. ఇప్పుడు టాయిలెట్ అవసరాన్ని తానే గుర్తించి చెప్పగలుగుతున్నాడు. చేతులతో వస్తువులను బాగా పట్టుకోగలుగుతున్నాడు. అంతేకాక క్యారమ్స్‌లో జిల్లా స్థాయిలో ప్రథమ, దోమలగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానం సాధించాడు. ఒకప్పుడు ఏదీ పట్టుకోలేని నా బిడ్డ ఇప్పుడు రాష్ట్రస్థాయిలో గెలుస్తుంటే మా ఆనందానికి అవధుల్లేవు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజాపూర్‌కు చెందిన శిరీష తన కుమారుడు కృపాకర్ గురించి చెబుతూ ‘మా బాబు అసలు నడవలేకపోయేవాడు. మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రతిరోజూ నైబర్‌హుడ్ కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ చేయించడంతో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు తనంతట తానే నడుస్తున్నాడు. మాటలు కూడా వస్తున్నాయి. ఇతర పిల్లల మాదిరిగా పాఠశాలకు వెళ్తున్నాడు. మా బాబు ఇలా మారతాడని ఎన్నడూ ఊహించలేదు. నైబర్‌హుడ్ కేంద్రాల వల్లే మా పిల్లలకు కొత్త జీవితం వచ్చింది. మా పిల్లలు అభివృద్ధి చెందడం చూసి ఇప్పుడు మాకు కూడా భవిష్యత్తుపై ధైర్యం వచ్చింది’ అంటూ కంటతడి పెట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *