– అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
– నేలపట్ల గ్రామాభివృద్ధి కోసం రూ.6.31కోట్లు
– ధర్మతండాకు రూ.5.95 కోట్లు
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
ఖమ్మం, కూసుమంచి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలపట్ల గ్రామంలో ముదిగొండ రోడ్డు నుంచి కొత్త చెరువు వరకు రూ.2.75 కోట్లతో బీటి రోడ్డు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. మునిగేపల్లి నుంచి వీరేంద్ర స్వామి దేవస్థానం వయా వెంకటాపురం మీదుగా రూ.3 కోట్ల వ్యయం కాగల 8 కిలోమీటర్ల మట్టి రోడ్డును మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేస్తామని అన్నారు. నేలపట్లలో రూ.34 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని, మరో రూ.15 లక్షలు మంజూరు చేశామన్నారు. అంగన్వాడి భవనానికి రూ.5 లక్షలు, త్రాగునీటి మరమ్మతు పనులకు రూ.2లక్షలు, గడిచిన 22 నెలల కాలంలో రూ.6.31కోట్లు నేలపట్ల అభివృద్ధికి మంజూరు చేశామన్నారు.ధర్మతండ గ్రామంలో రూ.3.75కోట్లు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. లోక్య తండా నుంచి ధర్మ తండా వరకు కోటి రూ.26 లక్షలతో నిర్మించ తలపెట్టిన రోడ్డు ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, వర్షాకాలం లోపు ఆ రోడ్డు శంకుస్థాపన చేస్తామని, రాబోయే వర్షాకాలంలోపు ఈ రోడ్లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు.గత 22 నెలల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో ధర్మతండా గ్రామానికి రూ.46 లక్షలతో అంతర్గం సిసి రోడ్లు నిర్మించుకున్నామని అన్నారు. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించామని, మొత్తం ధర్మతండా గ్రామానికి రూ.5.95 కోట్లమేర నిధులు అభివృద్ధి కోసం మంజూరు చేశామన్నారు. తమ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు, ఉగాది నుంచి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం, నూతనంగా పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారి, పాత రేషన్ కార్డులలో నూతన సభ్యుల పేర్లు నమోదు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ. 500 బోనస్ అందించామని, ప్రస్తుత సీజన్లో కూడా బోనస్ ఇవ్వడానికి క్యాబినెట్ నిర్ణయించిందని, రాబోయే వారం నుంచి పది రోజులలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు.పేద ప్రజలకు భరోసా, ధైర్యం అందించేలా ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం నిర్మిస్తుందని, పేద ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నేలపట్లలో మొదటి విడత 18 ఇండ్లు మంజూరు చేశామని, పేదలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రతి సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నేలపట్ల గ్రామంలో రూ.2.75 కోట్లతో ముదిగొండ రోడ్డు నుంచి కొత్త చెరువు వరకు, ధర్మతండ గ్రామంలో రూ.3.75కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు నుండి వెంకట్రామాపురం ఆర్ అండ్ బి రోడ్డు వరకు వయా ధర్మతండ బి.టి రోడ్డు పనులకు నేడు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. గ్రామాలలో నిర్మించబోయే బీటీ రోడ్ల వల్ల రైతులకు రోడ్ కనెక్టివిటీతో పంట కొనుగోలు కేంద్రాలకు తరలింపుకు వెసులుబాటు కలుగుతుందని, నిర్మాణ పనులను నాణ్యతతో ఇంజనీరింగ్ అధికారులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





