పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త

– జి ప్లస్‌-1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం
– మారనున్న మురికివాడల రూపురేఖలు
– రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లపై సచివాలయంలోని తన కార్యాలయంలో హౌసింగ్‌ అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపచేస్తున్నామన్నారు. కనీసం 30 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్‌-1 తరహాలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఈ మేరకు జీవోఎంస్‌ నెం.69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడిరచారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతోపాటు, స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్దికాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. వీరికి ఆర్‌ సిసి స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదని, ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో జి ప్లస్‌-1 నిర్మాణాలకు అనుమతినిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని దశలవారీగా నిర్మాణపు పనుల స్థాయినిబట్టి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. జిG1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంట గదిని నిర్మించుకోవాలి, ప్రతి ఇంటికీ ప్రత్యేకంగా టాయిలెట్‌, బాత్‌ రూంలు తప్పనిసరిగా ఉండాలని, ఈ ఇంటి నిర్మాణం ఆర్‌సిసి స్లాబ్‌తో ఉండాలని, ఇందుకు సంబంధించిన స్ట్రక్చరల్‌ డిజైన్లకు డిఇఇ (హౌసింగ్‌) అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాళ్ల ఇంటికోసం రూ.5 లక్షలు ఖర్చు చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page