ఛత్తీస్ ఘడ్ అంగీకరించితేనే గోదావరి కావేరి అనుసంధానం?

“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందుగా బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు అప్పుడే పెద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు. గోదావరి కావేరి అనుసంధానం వాస్తవంలో తెలంగాణకు తీవ్ర నష్టదాయక పథకమని పైగా తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్ర ప్రదేశ్ నుండి అనుసంధానం మొదలు పెడితే తెలంగాణ వాటా నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ కు ధార బోసినట్లని హరీష్ రావు ధ్వజమెత్తారు. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి కున్న సంబంధాలను పునశ్చరణ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ముందుకు వస్తుందో అనుమానమే..”

కేంద్ర ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కునిలాగా గోదావరి కావేరి అనుసంధానం కోసం సాగిస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే పదడుగులు వెనక్కి పోతోంది. మరీ ఆంధ్ర ప్రదేశ్ పోలవరం బనకచర్ల అనుసంధానం వెల్లడి తర్వాత మరి కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల అనుసంధానం తెర మీదకు తెచ్చిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డు పుల్ల వేసేందుకు సమ్మక్క బ్యారేజీ నుండి గోదావరి కావేరి అనుసంధానానికి లైన్ క్లియర్ చేశారు. దీని మీద కొంత పురోగతి లభించింది. ఈ లోపు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఒత్తిడి తెచ్చినట్లుంది. మరో వేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరకుండినట్లు లేదు.
    ఒక వేళ చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నికర జలాలు ఆధారంగా ప్రతిపాదించి ఉంటే  సమస్య లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల సంఘం ఒకటి రెండు మూడు ప్రత్యామ్నాయ పథకాలు ప్రకటించవలసి వచ్చింది. పోట్ల గిత్తలు పోట్లాడుకొంటుంటే లేగ దూడల కాళ్లు విరిగిన చందమైంది-కేంద్ర జల సంఘం పరిస్థితి.రోప్ డ్యాన్స్ చేస్తూ ఎవరిని సంతృప్తి పరచని పథకాలు ప్రకటించారు.
   కేంద్ర జల సంఘం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ పథకాలు  రెండు రాష్ట్రాలకూ పూర్తిగా అంగీకారం లేకుండా పోయింది. తెలంగాణ నుండి అనుసంధానం చేస్తే ఆంధ్ర ప్రదేశ్ అంగీకరించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ నుండి అనుసంధానం చేసేందుకు తెలంగాణ అంగీకరించదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందుగా బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు అప్పుడే పెద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు. గోదావరి కావేరి అనుసంధానం వాస్తవంలో తెలంగాణకు తీవ్ర నష్టదాయక పథకమని పైగా తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్ర ప్రదేశ్ నుండి అనుసంధానం మొదలు పెడితే తెలంగాణ వాటా నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ కు ధార బోసినట్లని హరీష్ రావు ధ్వజమెత్తారు. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి కున్న సంబంధాలను పునశ్చరణ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ముందుకు వస్తుందో అనుమానమే. ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థీతి భిన్నంగా లేదు. జలవనరుల శాఖాధికారులు తర్జన భర్జన పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఏకంగా 90 టిఎంసిలు  కృష్ణ నదీ నికర జలాలు ఇచ్చితే గోదావరి జలాల ద్వారా కలిగే లాభమెంత? ప్రధానంగా తాము ఉపయోగించుకోవాలని భావించిన 200 టిఎంసిలు గోదావరి వరద జలాలు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలి పోతున్నది. తాము ఇంతగా పోరాడినదీ గోదావరి కావేరి అనుసంధానంతో ముగుస్తుందా అనే చర్చ లేక పోలేదు.
    నాణేనికి ఇదొక వేపు అయితే మరో వేపు ఇంకా జఠిలంగా ఉంది . గోదావరిలో మిగిలి నికర జలాలు లేవని కేంద్ర జల సంఘం ఈపాటికే తేల్చి వేసి ఉంది . ఉన్న పళాన గోదావరి కావేరి అనుసంధానం చేపట్టే అవకాశాలు లేవని స్పష్టపరిచింది. కాబట్టే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఉపయోగించుకొనని నికర జలాలను గోదావరి కావేరి అనుసంధానానికి ఉపయోగించుకోవాలని తొలి నుండి విఫల యత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బిజెపి ప్రభుత్వం వచ్చినా సేమ్ టు సేమ్. తమ వాటా నీళ్లు ఇచ్చేందుకు తిరస్కరించింది. . తాము ఇంద్రావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని ఛత్తీస్ ఘడ్ జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశాల్లో స్ఫష్టం చేసింది. కాని దుర్మార్గమేమంటే ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు ఉపయోగించుకుంటామని ఈ లోపు గంగా నది అనుసంధానం జరుగుతుందని ఒక సమావేశంలో కేంద్ర జల సంఘానికి చెందిన ఒక అధికారి చెప్పారు.. ఇంకో సందర్భంలో ఇంకో అధికారి అది విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టని తేల్చి వేశారు. గోదావరి కావేరి అనుసంధాన పథకం పది సంవత్సరాలుగా నలుగుతున్నా రూపు రేఖలు ఏర్పడ లేదు. కానీ గంగా నది గురించి చెప్పడం ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి..!
    వాస్తవంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇంద్రావతి నదిపై బోధ్ ఘాట్ బహుళార్థ సాధక ప్రాజెక్టును కేంద్రం ఆమోదించింది 49 వేల కోట్ల రూపాయలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని మోదీ కి అభినందనలు చేసిన ప్రకటన వెలువడింది.ఈ పథకం ద్వారా 3 66 580 హెక్టార్లకు భూమికి సాగునీరు అందివ్వాలని రూపొందించారు ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం అది ఇచ్చంపల్లి నుండి మొదలు పెట్టినా లేక సమ్మక్క బ్యారేజీ నుండి మొదలు పెట్టినా లేక పోలవరం నుండి ప్రారంభించినా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఉపయోగించుకొనని 149 టిఎంసిలు లభ్యమైతే తప్ప కేంద్ర జల సంఘం డిపిఆర్ ఆమోదించ లేదు. ఒక వేళ ఛత్తీస్ ఘడ్ మొండికేస్తే గోదావరి కావేరి అనుసంధానం గోదారిలో నిమజ్జనం అవుతుంది. దిల్లీ లో కూడా ఈ అంశంపై తర్జనభర్జనలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *