ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం

– కాంగ్రెస్‌ ‌బాకీ కార్డులను ప్రతి ఇంటికీ పంచాలి
– ప్ర‌భుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌
– పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23:‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో రెండున్నర గంటలకుపైగా పార్టీ సీనియర్‌ ‌నేతలతో సమావేశమయ్యారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్‌ ‌బాకీ కార్డులను నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ పంచాలి.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వొచ్చాక తెలంగాణ ఆగమైంది.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆగమవుతున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరముంది.. ప్రజల్లో కాంగ్రెస్‌ ‌వైఫల్యాలపై విస్తృతంగా చర్చ జరగాలి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో రౌడీ షీటర్‌కు కాంగ్రెస్‌ ‌టికెట్‌ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. డివిజన్ల వారీగా ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. ‌మాగంటి గోపీనాథ్‌ ‌చనిపోయారని.. ఈ క్రమంలో ఉపఎన్నిక అనివార్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధను దిగమింగుకుని ధైర్యంగా ఎన్నికను ఎదుర్కోవాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, పార్టీ కేడర్‌కు సూచించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ ‌భారీ మెజారిటీతో గెలుస్తుందన్న‌ ధీమా వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్‌లో మెజారిటీపై ఫోకస్‌ ‌పెట్టాలని నేతలకు కేసీఆర్‌ ‌సూచించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ‌ప్రజలు బీఆర్‌ఎస్‌ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఫైర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌ ‌పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మాయమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌దుష్ట పాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని బీఆర్‌ఎస్‌ ‌నేతలకి సూచించారు. ఉప ఎన్నిక ఫలితం ప్రభావం జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలపైనా ఉంటుందని అభిప్రాయప‌డ్డారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ ‌గెలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు తమ వైపే ఉంటారని కేసీఆర్‌ ‌జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు, జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్‌ ‌నేతలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page