ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతుభరోసా ఆపబోం
దేశంలో మొట్టమొదటిసారి సన్నబియ్యం ఇస్తున్నాం
రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో, దేశంలో నాయకులు ఏ పదవి చేపట్టాలన్నా రైతుల అండ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడి, వారి విజయాలను, వినతులను విన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించి రైతుల పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారు. రైతులను నట్టేట ముంచిన వారు తమపై బురద జల్లుతున్నారన్నారు. 2014లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఎగ్గొట్టి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాము రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వరి వేస్తే బోనస్ ఇస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే రైతు భరోసా ఇస్తున్నామన్నారు. రానున్న 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుభరోసా ఆపబోమన్నారు. ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు చెందిన 70,11,984 మందికి రైతు భరోసా 9 రోజుల్లో అందజేస్తామన్నారు. రైతుల కోసం ఇప్పటి వరకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను సరిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో మొట్ట మొదటిసారిగా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. గత పాలకులు సర్పంచులకు చెల్లించాల్సిన రూ.1 లక్ష కోట్లు, కాంట్రాక్టర్లకు రూ.60 వేల కోట్లు, ఉచిత కరెంటు పేరుతో అప్పులు, ఇలా అందినకాడల్లా అప్పులు చేసి మొత్తంగా రూ.8 లక్షలకు పైగా అప్పులు తమ నెత్తిన పడేసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం జిల్లా నేలకొండ పల్లికి చెందిన రామకృష్ణ అనే రైతుతో మాట్లాడుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే రామకృష్ణా.. మీ ఖమ్మం వాళ్లు హుషారున్నారయ్యా .. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ శాఖ మీరే తీసుకుపోయారని చమత్కరించారు. ఇంకా ఏముందయ్యా మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినం.పంటలు కూడా మంచిగా పండించండి. అని రేవంత్ అనడంతో అక్కడ అందరూ నవ్వుకున్నారు. కార్యక్రమంలో రైతులు పేర్కొన్న కూరగాయల సాగు మీద మాట్లాడుతూ ముఖ్యమంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజూ జొన్న రొట్టె తింటే జిమ్ కు వెళ్ళకుండానే సిక్స్ ప్యాక్ బాడీ వస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడంతా ఏదో డైట్ అంటూ అడ్డమైన గడ్డి తింటున్నారని, రోజూ జొన్న రొట్టె తింటూ, ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటే జిమ్ములకు వెళ్ళి కండలు పెంచాల్సిన అవసరం ఉండదని యువతకి సలహా ఇచ్చారు. అచ్చంపేటలో పండించే దోసకాయ కందిపప్పు కలిపి వండి తింటే బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. వాటి మీదికి చికెన్, మటన్ కూడా పనికి రాదన్నారు. ఆ రుచులు ఇప్పుడు లేవని, అన్ని పంటలు మారిపోయాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన రైతుభరోసా నిధులు విడుదల చేశారు.