ప్రపంచంలోనే ఎత్తైన రెండు అంతస్తుల వంతెన

మలేషియాలో మరో అందమైన ప్రదేశం మలక్కా చారిత్రాత్మక నగరంఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద.  పూర్వకాలంలో సముద్ర వ్యాపారానికి కేంద్రంగా ఉండేదినగరాన్ని చేర డానికి కొంత దూరం పడవలో వెళ్ళాలినదికి రెండు తీరాల్లో పెద్ద పెద్ద అందమైన భవనాలు మనలను చూపు తిప్పుకోనివ్వవుఅవన్ని పోర్చుగీస్డచ్ భవనాలని తెలిసిందిఅక్కడి చర్చ్కట్టడాలు ఆనాటి చరిత్రను కళ్ళ ముందుంచాయి.

గిరియానం – 6

చాలా యేళ్ళ విరామం తర్వాత yhai సెంట్రల్ యూనిట్ వాళ్ళు మలేషియా ట్రిప్ మళ్ళీ ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసారు. ప్యాకేజీ ₹  25000/ మాత్రమే. విదేశీ ప్రయాణం 25 వేలకు చాలా చౌక అని Yhai హైదరాబాదు మహిళా యూనిట్ విహంగ నుంచి పదిమందికి పైగా బుక్ చేసుకున్నాం.  మలేషియా ఎయిర్  పోర్టులో ఉదయం ఆరుగంటలకు దిగి పోయాం. ఇండియాలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళను కలుపుకొని దాదాపు 35 మంది బృందం. Yhai వాళ్ళు ఏర్పాటు చేసిన స్థానిక యువతి గులియో మాకు పూల మాలలతో స్వాగతం చెప్పి వాళ్ళ దేశానికి సాదరంగా ఆహ్వానించింది. మా ఐదురోజుల ట్రిప్ ముగిసి మళ్ళీ తిరుగు ప్రయాణం కొరకు ఎయిర్ పోర్టులో దింపే వరకూ ఆమే కేర్ టేకర్ కం గైడ్. ఆమెకు ఇంగ్లీషు వస్తుంది. కాబట్టి మాకు ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయింది.

మలేషియా చాలా చిన్నదేశం. విస్తీర్ణం 329. 847 చదరపు కిలోమీటర్లు. అధికార భాష మలయ్. పర్యాటకంగా అభివృద్ధి చెందడం వలన హిందీ, ఇంగ్లీష్, తమిళం కూడా మాట్లాడుతారు. మలేషియా కరెన్సీని రింగిట్స్ అంటారు. ముస్లిం మతంతోపాటు హిందువులు, చైనీయులు కూడా కున్నారు. వీరి సంఖ్య చాలా తక్కువ. ప్రజలు చాలా సౌమ్యులు. ఎత్తైన భవనాలతో, ఫ్లై ఓవర్లతో అత్యాధునికంగా కనిపిస్తుంది.

 అందరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఒక గంటలో కౌలాలం పూర్ లోని YMCA హాస్టల్ దగ్గర దిగి పోయాం. అక్కడే మా బస ఏర్పాటు చేశారు. మూడంతస్తుల భవనం. A C గదులు. కింద రెస్టారెంట్ కూడా వుంది. ఎదురుగుండా ఎటుచూసినా ఎత్తైన భవనాలు. విశాలమైన రోడ్లు. పదకొండు గంటలకల్లా రెడీ అయి దగ్గరగా వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ ముగించి నగర పర్యటన మొదలు పెట్టాము. లోకల్ ట్రైన్ లో ఒక షాపింగ్ మాల్ కు వెళ్ళాం. అది మయసభలా వుంది. నా స్నేహితురాలు చిన్న బ్యాగ్ కొన్నది. మలేషియా కరెన్సీలో లెక్కచేసి బిల్ పే చేసి వెనక్కి తిరిగి చూసేసరికి మా వాళ్లెవరూ కనిపించలేదు. చాలా సేపు వాళ్ళ కొరకు వెతికాము. ఎవరూ కనిపించలేదు. గులియోకు ఫోన్ చేస్తే కలవ లేదు. మరెవ్వరికి ఫోన్ చేసినా కలవలేదు. మళ్ళీ మేం ట్రైన్ దిగిన చోటుకు వచ్చాం. ఎట్టకేలకు గులియో ఫోన్ కలిసింది. వారందరూ అక్కడినుంచి వెళ్ళారని, అక్కడ మమ్మల్ని ట్రైన్ ఎక్కి ఆ చోటుకు రమ్మని చెప్పింది. మేం అలాగే చేశాం. స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే మాకొరకు వస్తూ ఎదురుగా గులియో కనిపించింది. హమ్మయ్య! మందలో కలిసి పోయాము. కొత్త ప్రాంతాల్లో గ్రూప్ నుంచి విడిపోయినప్పుడు ఉండే ఆందోళన తగ్గింది.

తరువాత పుత్రజయ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ చూసాము. లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఆ ప్రాంతమంతా పరిపాలనా రంగానికి సంబంధించిన వివిధ శాఖల ఎత్తైన భవనాలతో వుంది. అక్కడ మద్యం, పొగతాగడం నిషిద్ధమని గైడ్ చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యం తోపాటు సంతోషం కలిగింది. ఆ ప్రాంతమంతా తిరిగి చూసి దగ్గరలో వున్న ఒక మసీదులోకి వెళ్లాం. బురఖా లేకుండా ప్రవేశం నిషిద్ధం. అయితే అక్కడ బురఖాలు అందుబాటులో ఉన్నాయి. లోపల ఆర్కిటెక్చర్ అద్భుతంగా వుంది.

మలేషియా దేశానికి తలమానికమైన ట్విన్ టవర్స్ ప్రవేశ రుసుము  ఒక్కరికి వందరూపాయలు. సీనియర్ సిటిజన్స్ కు యాభై రూపాయలు. దీనిని 1978లో నిర్మించారట. 2004 దాకా ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా రికార్డు వుంది. తరువాత మలేషియా లోనే దీని కన్నా ఎత్తైన భవనాలు చాలా వచ్చాయి. సాయంత్రం పూట ఆకాశం మేఘా వృతమై సన్నగా వర్షం కురుస్తున్న వేళ మేం ఆ టవర్స్ పైకి వెళ్ళాము.వీటి ఎత్తు 1,483 అడుగులు. 41,42 అంతస్తులలో రెండు టవర్లను కలిపే అద్భుతమై స్కైబ్రిడ్జి వుంది. ప్రయాణీకులకు అక్కడి వరకు వెళ్ళడానికే అనుమతి వుంది. ప్రపంచంలోనే ఎత్తైన రెండు అంతస్తుల వంతెన అది. వీటిలో ఒకటి మాల్, రెండోది మలేషియన్  ఫిల్మార్మోనిక్ ఆర్కెస్ట్రాకు సంబంధించిన కచేరీ హాల్. పై అంతస్తులో జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలున్నాయని చెప్పారు. అందుకే వాటిని పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని పిలుస్తారు కాబోలు. ఆ ట్విన్ టవర్స్ నిర్మాణ కౌశలాన్ని అభినందించకుండా ఉండలేం. వాటిని అమెరికన్ ఆర్కిటెక్ట్ సీజర్ పల్లి డిజైన్ చేశాడట. ఇస్లామిక్ సంస్కృతిని ప్రతిబింబించే శైలిలో నిర్మించబడింది.

మరోరోజు జెంటింగ్ ఐలాండ్ కు వెళ్ళాం. చేతికి అడ్మిషన్ బ్యాండ్ వేస్తారు. అది వుంటేనే లోపలికి అనుమతిస్తారు. మేం లోపలికి వెళ్ళగానే విద్యుద్దీపాల ధగధగలతో ఆధునిక మయసభలాగా వుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు,పెద్దలు, వృద్ధులు అందరూ ఆనందంగా కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. అది మన హైదరా బాదులోని వండర్ వరల్డ్ లాంటిది. కాకపోతే చాలా పెద్దది. జెయింట్ వీల్, టవర్ క్లైమ్బింగ్ లాంటి కొన్ని సాహస క్రీడలు మేము కూడా ఆడాం. ఎవరి ధైర్య సాహసాలు వాళ్ళవి.

మలేషియాలో నన్ను చాలా ఆకర్షించిన ప్రదేశం బటూకేవ్స్. కౌలాలం పూర్ నుంచి 13 కిమీ దూరంలో వున్నాయి.మానవుడు ఎంత అభివృద్ధిని సాధించి ఎత్తైన నిర్మాణాలు చేసినా ప్రకృతి ముందు దిగ దుడుపే అనిపిస్తుంది నాలాంటి ప్రకృతి ప్రేమికులకు.. కింద ఎత్తైన సుబ్రమణ్య స్వామి విగ్రహం. దాని వెనకనుంచే పైకి వెళ్ళడానికి ఎత్తైన సుమారు 3,4 వందల మెట్లు. సాధారణంగా గుహలు అంటే పైనుంచి కిందికి దిగుతాము. బొర్రా గుహలు, బెలుం  గుహలాంటివి. కానీ ఇక్కడ కొండపైన గుహలుండడం నాకు అబ్బరమనిపించింది. పైన కూడా మురుగన్ ఆలయం వుంది. భక్తులు దర్శనానికి క్యూలో నిలబడితే.. నేను మాత్రం ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ గుహలన్నీ తిరిగాను. గుహలలో నుండి వస్తున్న సూర్యకిరణాలు వింత శోభను తెచ్చిపెట్టాయి.

విలియం హోర్నెడ్ అనే అమెరికన వృక్ష శాస్త్రజ్ఞుడు 1878లో వీటిని కనుగొన్నాడు. 13 ఏండ్ల తరువాత 1891లో తంబిస్వామి పిళ్లై ఆ గుహలలో ఒకదానిలో మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి అక్కడ పూజలు మొదలయ్యాయి. దానివల్ల ఆ గుహాలయం అసహజ రంగులమయమైంది. కానీ మిగతా గుహలన్నీ సహజసిద్ధంగా వుండి ప్రకృతి ప్రేమికులను మురిపిస్తున్నాయి. దారి పొడుగునా కోతులున్నాయి.

మలేషియాలో మరో అందమైన ప్రదేశం మలక్కా చారిత్రాత్మక నగరం. ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద.  పూర్వకాలంలో సముద్ర వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. నగరాన్ని చేర డానికి కొంత దూరం పడవలో వెళ్ళాలి. నదికి రెండు తీరాల్లో పెద్ద పెద్ద అందమైన భవనాలు మనలను చూపు తిప్పుకోనివ్వవు. అవన్ని పోర్చుగీస్, డచ్ భవనాలని తెలిసింది. అక్కడి చర్చ్, కట్టడాలు ఆనాటి చరిత్రను కళ్ళ ముందుంచాయి.

ప్రకృతి, ఆధునిక, ప్రాచీన సంస్కృతుల మేళవింపుల మలేషియా ప్రయాణం ముగించుకుని ఎన్నో మధుర జ్ఞాపకాలతో స్వదేశానికి తిరిగి వచ్చాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page