కౌలు రైతులకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి : రైతు స్వరాజ్య వేదిక

•కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలి
•2011 సాగుదారు గుర్తింపు కార్డుల చట్టాన్ని ఈ ఖరీఫ్ నుండి అమలు చేయాలి
కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది. కౌలు రైతుల అంశంపై తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిన కన్సల్టేషన్ సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి కౌలు రైతులు పాల్గొని తమ సమస్యలను వివరించి, డిమాండ్లను వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన కౌలు రైతులు నిరాశకు లోనవుతున్నారని, తక్షణం 2025 ఖరీఫ్ సీజన్ నుంచి కౌలు రైతుల గుర్తింపు కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు స్వరాజ్య వేదిక, ఇతర రైతు సంఘాల ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొని 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం సోమవారం హైదర్ గూడా న్యూస్ సెంటర్ లో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాల నుండి వచ్చిన కౌలు రైతులు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు మీడియాతో మాట్లాడారు. జిల్లాల నుండి కౌలు రైతులు పాల్గొన్నారు. కురువ మంజూల, రమాకాంత్, మాదాసు మాధవి, చాపల సుజాత, ఎడ్ల మానస, ముదస్తు సుమలత, డి.శ్రీనివాస్, రాందాస్, ఎం.రమేష్, రైతు స్వరాజ్య వేదిక నుండి బి.కొండల్, కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, ఎస్.ఆశాలత పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ‘మా ప్రభుత్వానికి కౌలుదారులతో సంబంధం లేదు’ అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకి న్యాయం జరుగుతుందని నమ్మిన తమకు ఇప్పటి వరకు నిరాశే ఎదురయిందని కౌలు రైతులు బాధ వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామం నుండి కురువ మంజుల మాట్లాడుతూ మేము ఎప్పటి నుండో కౌలు సాగు చేస్తున్నాము, అప్పుల బాధ భరించలేక నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం కానీ, పథకం కానీ అందట్లేదు. 2022 లో భారత్ జోడో యాత్ర జరిగినప్పుడు నేను రాహుల్ గాంధీతో కలిసినాను. నా బాధ చెప్పుకున్నాను. కౌలు రైతులకు తప్పక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నేను ఇప్పటికీ కౌలుకి భూమి పట్టుకొని వ్యవసాయం చేస్తున్నా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటి వరకు మాకు రైతు భరోసా కానీ, పంట రుణాలు కానీ, ఎటువంటి పథకం రావట్లేదు. మాకు న్యాయం ఎప్పుడు చేస్తారని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని మళ్ళీ అడుగుతున్నాను, అని అడిగారు. ఆదిలాబాదు జిల్లా తలమడుగు మండలం నుండి వచ్చిన కౌలు రైతులు రమాకాంత్ మాట్లాడుతూ గతంలో తమకు 2011 చట్టం ప్రకారం సాగుదారు గుర్తింపు కార్డులు(ఋణ అర్హత కార్డులు) వచ్చాయని, ఆ కార్డులు ఉపయోగించి 2018, 2019 లో తాము జెఎల్జీ గ్రూప్ లు ఏర్పాటు చేసుకొని బాంకు రుణాలు తీసుకున్నామని, తమకు పంట నష్టపరిహారం, పంట బీమా చెల్లింపులు కూడా వచ్చాయని తెలిపారు. పంట కొనుగోలు కేంద్రాలలో కూడా ఆ కార్డులు ఉపయోగించి కనీస మద్దతు ధరకు అమ్ముకున్నామని తెలిపారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం కార్డులు ఇవ్వడం ఆపి వేయడం వలన అప్పటి నుండి తమకు పూర్తి అన్యాయం జరుగుతున్నట్లు బాధ వ్యక్తం చేశారు. ఇటీవల జొన్న కొనుగోలు కేంద్రాలలో భూమి పట్టాదారుల అకౌంటులోనే డబ్బులు వేయడం వలన కౌలు రైతులు అమ్ముకోలేకపోయారని చెప్పారు. వెంటనే కాంగ్రెస్ గతంలో తీసుకు వచ్చిన 2011 చట్టాన్ని మళ్ళీ అమలు చేసి గుర్తింపు కార్డులను కౌలు సాగుదారులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 13, 2023 తేదీన అప్పటి టిపిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి తెలంగాణ కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖ కాపీలను రైతు స్వరాజ్య వేదిక నాయకులు మీడియాకి అందించారు. ఆ లేఖలో కౌలు రైతులకు కాంగ్రెసు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని, 2011లో కాంగ్రెస్ తెచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం తీసుకు వచ్చింది, ఆ చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మళ్ళీ ఇస్తుందని, రైతు భరోసాతో బాటు ఇతర పథకాలను, పంట రుణాలను కూడా అందిస్తుందని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. కాంగ్రెస్ తమ వరంగల్ డిక్లరేషన్ లోనూ, ఆరు గ్యారంటీలలోనూ కౌలు రైతులకి పథకాలు అందిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరాలు అయినా ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడం పూర్తి అన్యాయం అని రైతు స్వరాజ్య వేదిక నాయకులు అన్నారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలలో 75 శాతం కౌలు రైతులవే అని, కౌలు రైతులను గుర్తించి వారికి పూర్తి మద్దతు అందిస్తేనే రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ ను సాధించగలమని నాయకులన్నారు.
 వరి పంట కొనుగోలులో ఇస్తున్న రూ.500 బోనస్ ను కౌలు రైతులకి కూడా అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, చాలా తక్కువ శాతం కౌలు రైతులకి మాత్రమే అది అందిందని రైతుస్వరాజ్య వేదిక నాయకులు అన్నారు. కౌలు రైతుల గుర్తింపుకి నిర్దిష్టమైన వ్యవస్థ లేకపోవడం తో అది స్థానిక అధికారుల దయ పై ఆధారపడి ఉందని, అధికారులు కూడా చట్టప్రకారం ఆదేశాలు లేకపోవడంతో ఎక్కువ శాతం కౌలు రైతులను నిరాకరించారని వారు తెలిపారు. 2025 ఖరీఫ్ సీజన్ మొదలు కాక ముందే వెంటనే 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతుల నుండి దరఖాస్తులు తీసుకొని, చట్టప్రకారం గ్రామ సభలలో విచారణ ఆధారంగా వారికి కార్డులు ఇవ్వాలని కౌలు రైతులు, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ కార్డులు ఇవ్వడం వలన భూ యాజమానులకు వారి భూమి మీద కల హక్కులకు ఎటువంటి భంగం కలగదని, ఈ విషయం చట్టంలోనూ, కార్డుల పైనా స్పష్టంగా ఉందని వారు గుర్తు చేశారు. ఈ విషయం పై భూ యాజమానులకు అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, దాని కొరకు రెవెన్యూ యంత్రాంగం గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలని వారు అన్నారు. వెంటనే 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తూ, కౌలు సాగుదారుల నుండి దరఖాస్తులు తీసుకొని, వారికి ఎల్.ఈ.సి. గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు పంట బీమా, పంట నష్ట పరిహారం, రైతు బీమా, పంట అమ్మకము, బ్యాంకు రుణాలు, వంటివన్నీ అందించాలన్నారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సహాయం కాబట్టి, కౌలు రైతులు స్వంత పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాము కాబట్టి, రైతు భరోసా సహాయాన్ని కౌలు రైతులకు కూడా అందించాలన్నారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన ఈ హామీని మొదటి సంవత్సరంలోనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page