ఫుడ్‌పాయిజన్‌పై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్ల, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలను తేల్చేందుకు కొత్తగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారి ఉండనున్నారు. వీరు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలు, హాస్పిటల్‌ల్లోని ఆహార భద్రతను పర్యవేక్షించనున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనున్నారు.
టాస్క్‌ఫోర్స్‌తో పాటు రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉండనున్నారు. ఈ కమిటీ వంట చేసే ముందు కిచెన్‌ను పరిశీలించి పరిశుభ్రతను నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు భోజనం రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలి. ఈ మేరకు ఫేడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గురుకులాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఈ నెల 30 నుంచి వొచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల బాట నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు మహిళ నేతలు సందర్శించనున్నారు. అలాగే గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్ తరపున అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు.