– రాముడు తెలంగాణలో.. మాన్యం భూములు ఏపీలో
– ఆంధ్రలో కలిపిన ఐదూళ్లు వెంటనే వెనక్కి ఇచ్చేయాలి
– తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత డిమాండ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్20: పోలవరం నిర్మాణంతో భద్రాచలం పూర్తిగా మునిగిపోవడం ఖాయమని, అందుకే తాము పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యతిరేకించామని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అప్పట్లో తాము సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ప్రాజెక్టు ఆగలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ముంపుపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, ఫురుషోత్తపట్నం, ఎటపాక, గుండాల, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆమె అన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ప్రమాదం ఏర్పడిందన్నారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని, ఆ దేవుడి మాన్యం ఆంధ్రాకు పోయిందన్నారు. దేవుడేమో తెలంగాణలో ఉన్నాడని, అక్కడ దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందని అన్నారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని కవిత కోరారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని, ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కవిత డిమాండ్ చేశారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లేదంటే ఎప్పుడైనా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్నారు. 2014లో ప్రధాని మోదీ మొట్ట మొదటి కేబినెట్ సమావేశంలో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్‌ను ఆమోదించి తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పజెప్పారని, బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని విమర్శించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో మేము గళమెత్తామన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని కవిత పేర్కొన్నారు.