నేడే తొలి విడత పంచాయతీ పోరు

– ఎన్నికల నిర్వహణకు స‌ర్వం సిద్ధం
– తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులు
– రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్‌ ‌స్టేషన్లు ఏర్పాటు
– తొలి విడతలో వోటేయనున్న 56,19,430 మంది వోటర్లు
– గ్రామాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు
-‌ మధ్యాహ్నమే వోట్ల లెక్కింపు.. ఫలితం ప్రకటన
– వివరాలు వెల్లడించిన ఎన్నికల కమిషనర్‌ ‌రాణికుముదిని

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌10: ‌రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధ్దం అయ్యింది. ఇప్పటికే జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు నేటి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ పెరిగింది. తొలి దశ గ్రామ ఎన్నికల పోలింగ్‌ ‌గురువారం జరగనుంది. హైదరాబాద్‌లో ఎస్‌ఈసీ రాణి కుముదిని విలేఖర్లతో మాట్లాడుతూ తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. గురువారం ఉదయం 7.00 గంటల నుంచి ఈ పోలింగ్‌ ‌ప్రారంభమవుతుందన్నారు. ఈ తొలి దశలో 56,19,430 మంది వోటర్లు.. తమ వోటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌రాణి కుముదిని వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి విడత సర్పంచ్‌, ‌వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,236 గ్రామపంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల పక్రియలో భాగంగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్‌ ‌స్టేషన్లు ఏర్పాటు చేయగా, 56,19,430 మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్‌చేశామని వివరించారు. 50వేల మంది సివిల్‌ ‌పోలీసులు విధుల్లో ఉంటారని, 60 ప్లటూన్స్ ‌బృందాలు బయటి నుంచి వొచ్చాయని ఎస్‌ఈసీ తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం సుమారు లక్ష మంది ఎన్నికల సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల పక్రియను పర్యవేక్షించేందుకు 2,489 మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. పారదర్శకత కోసం 3,461 పోలింగ్‌ ‌స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ ‌నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 45,086 బ్యాలెట్‌ ‌బాక్సులు వినియోగించనున్నారు. వోటర్‌ ‌సౌలభ్యం దృష్ట్యా 99 శాతం వోటర్‌ ‌స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందని కమిషనర్‌ ‌వెల్లడించారు. మిగతా వోటర్లు ‘టీఎస్‌ ఈ-‌పోల్‌ ‌మొబైల్‌ ‌యాప్‌’ ‌ద్వారా కూడా తమ వోటర్‌ ‌స్లిప్‌ను డౌన్‌లోడ్‌ ‌చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే వోటింగ్‌ ‌కేంద్రం తెలుసుకునేందుకు అదే యాప్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా ఇప్పటివరకు 3,214 ఎఫ్‌ఐఆర్‌ లు న‌మోదు చేసినట్లు తెలిపారు. అంతేకాక 31,428 మందిని బైండోవర్‌ ‌చేసినట్లు, 902 లైసెన్డస్ ఆయుధాల డిపాజిట్‌, ‌రూ.7.54 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ‌విలువైన లోహాల స్వాధీనం చేసుకున్న‌ట్లు రాణి కుముదిని వెల్లడించారు. భద్రతా చర్యలలో భాగంగా 31 జిల్లాల అధికారులకు మేజిస్ట్రేట్‌ ‌పవర్స్ ఇచ్చామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌, ‌రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ప్రచారం కూడా మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఎలాంటి భ‌యం లేకుండా ప్రతి ఒక్కరూ వోటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషనర్‌ ‌రాణి కుముదిని కోరారు. ప్రజాస్వామ్య బలోపేతంలో వోటు కీలకమని పేర్కొంటూ గ్రామాల భవిష్యత్తు నిర్ణయంలో వోటు శక్తిని గుర్తించాలన్నారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రతి పోలింగ్‌ ‌స్టేషన్‌ ‌వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 18 రకాల ఐడి కార్డులను అందుబాటులో ఉంచినట్లు, ఏ రకమైన ఐడి కార్డును పోలింగ్‌ ‌బూత్‌ అధికారులకు చూపించినా వోటు వేయవచ్చునన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మేజిస్టీరియల్‌ ‌పవర్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఈసీ వివరించారు. పోలింగ్‌ ‌పూర్త‌యిన వెంట‌నే కౌంటింగ్‌ ‌జరుగుతుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page