నలుగురు గల్లంతు!
రక్షణ చర్యలు చేపట్టిన భారత నౌకాదళం
తిరువనంతపురం : కేరళ తీరంలో ఓ కార్గో నౌకలో సోమవారం హఠాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి ఎంవీ వాన్ హై 503 అనే ఈ నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లు తెలుస్తోంది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అరిaక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక ఈనెల 7న కొలంబో తీరం నుంచి బయల్దేరింది. ఇది మంగళవారం నాటికి ముంబయికి చేరుకోవాల్సి ఉంది.
నలుగురు గల్లంతు
ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది సముద్రంలోకి దూకారు. వారిని భారత నేవీ, ఐఎన్‌ఎస్ సూరత్ కోస్టు గార్డ్స్ రక్షించి మంగళూరు పోర్టుకు తీసుకొచ్చారు. గల్లంతైన వారిలో ఇద్దరు తైవాన్, ఒకరు ఇండోనేషియా, ఒకరు మయన్మార్ వాసులుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో 5గురు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.





