సర్కార్‌పై పోరాటం ఆగదు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– విజయవంతంగా మహా నిరాహార దీక్ష
– బీజేపీ కార్యాలయానికి పోటెత్తిన జన ప్రవాహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : నిరాహార దీక్ష ముగిసినా విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఆగదని, ప్రభుత్వం రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామచందర్ రావు చేపట్టిన మహా నిరాహార దీక్ష ప్రజా మద్దతుతో విజయవంతంగా ముగిసింది. విరమణ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆటంకాలు కల్పించినా బీజేపీ కార్యకర్తల సంకల్పం ముందు అవి వీగిపోయాయి. మొదట ధర్నా చౌక్ వద్ద అనుమతి నిరాకరించిన పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు దీక్ష చేసుకోవడాన్ని కూడా అడ్డుకోవాలని చూశారు. కనీసం దీక్ష శిబిరానికి వైద్య బృందాన్ని, అంబులెన్స్ సేవలను కూడా ప్రభుత్వం నిరాకరించింది. అయినప్పటికీ రామచందర్ రావు పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ మహా దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి అనూహ్య స్పందన లభించింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, మేధావులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉద్యమ గీతాలు, ఆటపాటలు, ధూంధాం సాంస్కృతిక ప్రదర్శనలతో రాష్ట్ర కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీలతోపాటు ప్రముఖ ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఆయుర్వేద, యూనాని, హోమియోపతి కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి రామచందర్ రావుకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ పోరాటానికి అండగా నిలిచిన విద్యార్థి లోకానికి, యువతకు, మేధావులకు, విద్యాసంస్థల ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు బీజేపీ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. యువమోర్చా(బీజేవైఎం) సేకరించిన ఐదు లక్షలమంది విద్యార్థుల సంతకాల పత్రాలను ఈ సందర్భంగా సమర్పించి కాంగ్రెస్ సర్కార్‌కు హెచ్చరిక చేసింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్షులు దీక్షా శిబిరానికి తరలివచ్చి మద్దతు పలికారు. వీరితోపాటు డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వివిధ విద్యాసంస్థల అధినేతలు, కాలేజీ యాజమాన్యాలు, అధ్యాపకులు, లెక్చరర్లు, ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, కార్మిక సంఘాల నేతలు, ఎక్స్-సర్వీస్‌మెన్ సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ఫీజు బకాయిల సాధనలో బీజేపీకి అండగా ఉంటామని ముక్తకంఠంతో చాటిచెప్పారు. ఈ సందర్భంగా దీక్షా ప్రాంగణంలో బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థుల గోడు పట్టదు కానీ.. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ అంటూ విదేశాల్లో విహరించడానికి సమయం దొరుకుతుందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ‘ఛాత్రోం కీ గూంజ’ అని విద్యార్థుల కోసం పోరాడుతున్నట్లు నాటకాలు ఆడే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యార్థుల రోదన ఎందుకు వినపడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకపోతే విద్యార్థులతో కలిసి సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్‌ను గద్దె దించుతామని నేతలు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

వైద్యుల హెచ్చరిక

దీక్ష రామచందర్ రావు రక్తపోటు పడిపోవడం, షుగర్ లెవెల్స్ తగ్గడంతో ఆరోగ్యం క్షీణించింది. వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి దీక్షను కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల బలవంతపు విజ్ఞప్తి మేరకు, వైద్యుల సలహాను పాటించి రామచందర్ రావు దీక్షను విరమించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేతుల మీదుగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర ముఖ్య నేతలు రామచందర్ రావుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో శాసనమండలిలో బీజేపీ పక్షనేత ఏవీఎన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, రేఖా శర్మ, మల్కాజ్‌గిరి, మెదక్, నిజామాబాద్, చేవెళ్ల ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్‌బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ మోర్చాల నేతలు, పార్టీ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యతను తీసుకున్న బీజేపీ : ఈటల

విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యతను బీజేపీ తీసుకుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ‘తాను లండన్ పోయినా.. అమెరికాకు పోయినా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్‌ఫÛర్డ్ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నారన్నారు. కానీ ముఖ్యమంత్రి గారూ.. ఒక్కసారి రాష్ట్రంలోని విద్యార్థుల పరిస్థితి గురించి కూడా ఆలోచించండన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనన్నారు. పార్టీలు వస్తాయి.. పోతాయి.. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం పనిచేయాలి అని ఆయన హితవు పలికారు. 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద తల్లిదండ్రుల పిల్లలు కూడా గొప్పగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, ఉన్నతాధికారులు కావాలి.. అదే నిజమైన తెలంగాణ అభివృద్ధి.. ఫీజుల బకాయిలు చెల్లించే వరకు.. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరు కొనసాగుతుంది అని ఈటల స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *