– మిగిలిన లక్ష్యాన్ని వర్షాల సమయంలో పూర్తిచేయాలి
– ఉపాధి హామీ కూలీల” రోజుకు కనీసం 60మందికి పని కల్పించాలి
– మహిళా సంఘాలు కుట్టే యూనిఫామ్‌లలో నాణ్యతకు ప్రాధాన్యత
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను పూర్తిచేయడంతోపాటు ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి ఆస్తుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఇతర శాఖల పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమైనప్పటికీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 5.32 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. ఇది గణనీయమైన పురోగతి అని పేర్కొంటూ మిగిలిన లక్ష్యాన్ని కూడా వర్షాలు అనుకూలంగా ఉన్న ప్రస్తుత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండాకాలంలోనే ఉపాధి హామీ కూలీల సహకారంతో మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధం చేశామని, ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ తొలి వర్షాలు పడగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇప్పుడు 86 శాతం లక్ష్యం పూర్తయిన నేపథ్యంలో నాటిన మొక్కలు ఏ మేరకు ఎదుగుతున్నాయి, వాటి మనుగడ ఎలా ఉంది అన్నదానిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. వాగులు, వంకలు, రహదారులకు ఇరువైపులా, చెరువుల పరిసరాలు, శ్మశానవాటికలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు తదితర ప్రాంతాలను వినియోగించుకుని మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
ప్రతీ మొక్కను కాపాడాలి
మొక్కలు నాటడంతో కార్యక్రమం పూర్తయినట్లు భావించక వాటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారు. వర్షాలు లేని రోజుల్లో క్రమం తప్పకుండా నీరు అందించాలని, ప్రతి మొక్క చుట్టూ నీరు నిలిచేలా గుంతలు, తట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మొక్కలకు రక్షణ కంచెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా అవెన్యూ ప్లాంటేషన్లలో ఫెన్సింగ్ పటిష్టంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ మొక్కలు నాటి 100 శాతం మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బంది మొక్కల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక వాతావరణానికి అనువైన ఇప్ప, తునికి, అడవి మామిడి వంటి మొక్కలను కూడా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. దీంతో పర్యావరణ పరిరక్షణతోపాటు గ్రామీణ ప్రజలకు, వన్యప్రాణులకు కూడా ప్రయోజనం కలిగేలా కార్యక్రమాన్ని బహుళ ప్రయోజన కార్యక్రమంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేసి వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలన్నారు.
ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడమే ప్రథమ బాధ్యత
ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పనికి సిద్ధంగా ఉన్న ప్రతి కూలీకి పని అందాలని, కూలీలు తమ నివాస ప్రాంతానికి సమీపంలోనే పని పొందేలా ప్రతీ ఆవాసంలో తగిన పనులను ప్రారంభించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో సరిపడ పనుల షెల్ఫ్ సిద్ధంగా ఉంచాలని, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి కూలీల సమీకరణ బాధ్యతలను స్పష్టంగా అప్పగించాలని సూచించారు. ఎనఎంఎంఎస్ హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. కూలీలు ఉపాధికి సిద్ధంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వారి హాజరు ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అన్నారు. తక్కువ పనితీరు ఉన్న మండలాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఫార్మ్ పాండ్లు.. నీటి సంరక్షణకు శాశ్వత ఆస్తులు
మంజూరైన అన్ని ఫార్మ్ పాండ్ల పనులను వెంటనే ప్రారంభించాలని సీతక్క ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,046 ఫార్మ్ పాండ్ల లక్ష్యానికి గాను 8,924 పనులు మంజూరయ్యాయని, అయితే గ్రౌండింగ్ పూర్తయినవి తక్కువగా ఉన్నాయని, పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఉపాధి హామీ ద్వారా కూలీలకు పని కల్పించడంతోపాటు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులుగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల రీచార్జ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్థానిక వాగులు, వంకలు, నీటి ప్రవాహ మార్గాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో వీబీజీ-రామ్‌జీ చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నిల్వ చేసిన నీటిని పశువులు, ఇతర జీవజాలం దాహార్తిని తీర్చేందుకు ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. బోర్‌బావులు, మోటార్లపైనే ఆధారపడక వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని, సాధ్యమైనచోట కాల్వల అనుసంధానం, వాగులు వంకల నీటి వినియోగంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యత
ఆదివాసీ, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులను వేగంగా ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, నీటి సంరక్షణ, జీవనోపాధి ఆస్తుల సృష్టి ఏకకాలంలో జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఫార్మ్ పాండ్లను వెంటనే గ్రౌండ్ చేసి తక్కువ పనితీరు ఉన్న జిల్లాలకు ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
చేయూత పెన్షన్లపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన
చేయూత పెన్షన్లకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హతను నిర్ధారించాలని సూచించారు. అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అందేలా చూడటంతోపాటు, మరణించిన వ్యక్తుల పేర్లపై పెన్షన్లు కొనసాగకుండా రికార్డులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలన్నారు.
మహిళా సంఘాల గౌరవం నిలిచేలా యూనిఫామ్‌ల తయారీ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌లను కుట్టే అవకాశం మహిళా సంఘాలకు లభించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూర్చే విధంగా వినియోగించుకోవాలన్నారు. యూనిఫామ్‌లలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, నాణ్యతను కాపాడుతూనే నిర్ణీత సమయంలో సరఫరా పూర్తి చేయాలని సూచించారు.
పనితీరును ప్రోత్సహించే వారికి గుర్తింపు
వన మహోత్సవం, ఉపాధి హామీ, నీటి సంరక్షణ తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి గాంధీ జయంతి సందర్భంగా ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కేవలం కాగితాలపై కాక క్షేత్రస్థాయిలో ఫలితాలుగా చూపాలని, ప్రతీ కార్యక్రమం పురోగతిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి అంటే పనులు కల్పించడం మాత్రమే కాదని, ఉపాధితోపాటు పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, జీవనోపాధి ఆస్తుల సృష్టి, మహిళల ఆర్థిక సాధికారతను సమగ్రంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, జిల్లా సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, అదనపు డీఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి సీతక్క తన నివాసం ప్రజా భవన్‌లో ప్రత్యేక వనమాహోత్సవంలో భాగంగా మామిడి మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





