– 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి
– 27 నుంచి 30 వరకు లక్కీ డ్రా
– మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం
– సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ
– రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి
– 27 నుంచి 30 వరకు లక్కీ డ్రా
– మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం
– సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ
– రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : పేదవాడికి కూడా నగరంలో సొంత ఇల్లు ఉండాలని, ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పురోగతి, లబ్దిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, కొత్త నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాపన చేసుకున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ప్రక్రియను పూర్తిచేశామని వెల్లడించారు. క్యూఆర్ పరిధిలోని తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం జూన్ 20 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 60,720 దరఖాస్తులు అందాయని, వచ్చిన దరఖాస్తులపై 360 డిగ్రీల క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. అనర్హతకు గల కారణాలను దరఖాస్తుల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. ఈనెల 28, 29, 30 , 31తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని, ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణాధికారిని కూడా నియమించామని తెలిపారు. లక్కీ డ్రా ద్వారా లబ్దిదారుల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10,000 ఈఎండీ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 28న రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి, రెడ్‌హిల్స్, 29న కౌకూర్, పాటిగడ్డ, జల్పల్లి, కుల్సుంపుర, 30న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్పల్లి, బండ్లగూడ(ఎలఐజి కాలనీ), నందిముసలిగూడ, 31న గాజులరామారం, అంబర్‌పేటలోని సిటీ పోలీస్ లైన్స్, గడ్డిఅన్నారం, ఆర్అండ్బి క్వార్టర్స్, పోచారం(ఎల్ఐజి కాలనీ)లో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల ఎంపిక
క్యూర్ పరిధిలో కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామని , ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మొత్తం 1,920 ఇళ్ల నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్‌నగర్ గ్రామంలోని అమంగల్, గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్పూర్(ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో(ఫలక్‌నుమా సమీపంలో) ఇళ్లు నిర్మించేందుకు వీలుగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నాలుగింటి పరిధిలోని అర్హులైన ప్రజలు ఇందిరమ్మ టవర్స్ కోసం సెప్టెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాలకు వర్తింపజేసిన నిబంధనలే ఈ కొత్త నియోజకవర్గాలకూ వర్తిస్తాయన్నారు.
————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




