- రోడ్డు సర్వేను అడ్డుకున్న సాకిబండ తండా రైతులు
- స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సర్వే వొద్దని వేడుకోలు…
- పోలీసులు, అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ ఫోర్త్ సిటీ అభివృద్ధిలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆమనగల్ మున్సిపాలిటీ లోని సాకిబండ తండాలోని వ్యవసాయ పొలాల్లో సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు వచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని సర్వే పనులను అడ్డుకున్నారు. గురువారం రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బలగాలతో సర్వే చేపట్టేందుకు రాగా తమ భూములు బలవంతంగా పోలీసులతో భయపెట్టి లాక్కోవద్దని కోరుతూ ఆందోళనలకు సిద్ధమయ్యారు! రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టేందుకు సర్వే నంబర్ 194 లో రైతు పొలాల్లోకి ఆమనగల్లు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సర్వేయర్లు ఆమనగల్లు, కడ్తాల్ సిఐలు ప్రమోద్ కుమార్, శివప్రసాద్ తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ పలువురు ఎస్ఐలు భారీ పోలీసు బలగాలతో సర్వే నిర్వహించేందుకు రాగా అడ్డుతగిలారు.
దీంతో సర్వే నిర్వహించేందుకు వొచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకొని సర్వే నిర్వహించొద్దని వేడుకున్నారు. సుమారుగా రెండు మూడు గంటల పాటు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించకుండా అక్కడే నిలబడ్డారు. విషయం తెలుసుకున్న షాద్ నగర్ ఏసిపి రంగస్వామి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించే యత్నం చేశారు. రైతులు ససేమిరా అనడంతో చివరకు కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి రైతుల వద్దకు వొచ్చి రైతులతో మాట్లాడారు. ఆయన మాటలు విన్న రైతులు తమ పొలాలను ఇచ్చే ప్రసక్తేలేదని చెబుతూ ఇక్కడికి వెళ్లిపోవాలని వేడుకున్నారు. ఆర్డిఓ మాట్లాడుతూ ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తుందని, ఎవరికీ ఎటువంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. సర్వే నిర్వహిస్తేనే అసలైన రైతుల వివరాలు తెలుస్తాయని వారికి నష్టపరిహారమిచ్చేందుకు వీలు కలుగుతుందని వారికి నచ్చజప్పేందుకు ప్రయత్నించారు.
సర్వే నిర్వహిస్తే ఎంత నష్టం ఇవ్వాలనేదే ప్రభుత్వం ఒక అంచనాకు వొస్తుందని తెలిపారు. 2013 చట్ట ప్రకారమే ప్రభుత్వం పరిహారం ఇస్తుందని రైతన్నలతో చర్చలు జరిపి గ్రామ సభ నిర్వహించిన అనంతరమే రైతుల ద్వారా భూములు తీసుకుంటుందని ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. మీ సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అయినా రైతులు మా భూములు మాకే కావాలి రోడ్డు వద్దే వద్దు,, ప్రభుత్వ భూములు ఉంటే సర్వే చేసుకోండి అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ ప్రభుత్వ భూములు ఏవీ లేవని తాత ముత్తాతల కాలం నుంచి భూములను సేద్యం చేసుకుంటూ బతుకుతున్నామని ఏ ఆధారం లేని తమను రోడ్డున పడేయడం భావ్యంగా లేదని రైతులు వాపోయారు. వీరి ఆందోళనకు స్థానిక బిఆర్ఎస్, బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం అధికారులు సర్వే నిర్వహించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.