కొత్త ఏడాదిలో మరింత దూకుడుగా హైడ్రా..
ఆక్రమణలన్నీ రికార్డు చేస్తున్నాం
హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్‌ఎం ఛానల్!
అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు 15 బృందాలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కొత్త సంవత్సరంలో హైడ్రా మరింత దూకుడు పెంచుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కూల్చివేతలు ఆగలేదు.. ఇంకా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. చెరువుల హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతోందన్నారు. స్పష్టత రాగానే హైడ్రా యాక్టివ్‌గా ఉంటుందని, చెరువులను అభివృద్ధి చేస్తూనే.. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని తేల్చిచెప్పారు. ఎల్టిఎఫ్ నిర్దారణ అనంతరం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. ఇందుకోసం 15 హైడ్రా బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని తేల్చిచెప్పారు. అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించామని తెలిపారు. హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్‌ఎం ఛానల్‌కు ప్రయత్నిస్తున్నాం. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుంది. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుంది. జూలై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిపై చర్యలు తప్పవు.
వొచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న షెడ్లపై ప్రజలెవరూ అద్దెకు తీసుకోవద్దు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తున్నాం‘ అని రంగనాథ్ వెల్లడించారు. 2024 జూలై 19వ తేదీన హైడ్రా ఆవిర్భవించిందని అన్నారు. హైడ్రా 5 నెలల పని తీరు, వొచ్చే ఏడాది కార్యాచరణను ప్రకటిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. శనివారం హైడ్రా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2050 కిలోమీటర్ల పరిధి.. తెలంగాణలో 33 శాతం హైడ్రా పరిధిలోకి వొస్తుందని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల భూమిని కాపాడిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడామని అన్నారు. బఫర్ జోన్‌లపై ప్రజల్లో అవగాహన పెరిగిందని రంగనాథ్ పేర్కొన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
కొత్తగా 1025 చెరువుల హద్దులను ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ చెప్పారు. హైదరాబాద్‌లో హైడ్రా సమాచారం చేరవేసేందుకు ఓ ఎఫ్ఎం రేడియో ప్రారంభిస్తామని తెలిపారు. జూలై 19వ తేదీకు ముందు తర్వాత అక్రమ కట్టడాలను శాటిలైట్ ఇమేజ్ ద్వారా గుర్తిస్తున్నామని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే హైడ్రా పని కాదని.. 12 చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పారు. డీఆర్‌ఎఫ్‌లో 72 టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
హైడ్రా పై అసత్య ప్రచారం..
కొంత మంది హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. దీనిని ఖండిస్తున్నామని రంగనాథ్ అన్నారు.‘హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది. ఐదు నెలల అనుభవాలు, వొచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం. హెచ్‌ఎండిఎ వరకు హైడ్రా పరిధి ఉంది. జీహెచ్‌ఎంసీ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను కేటాయించింది. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం. 12 చెరువులు, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా హైడ్రా కాపాడింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది.1095 చెరువుల్లో వొచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత. శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్‌తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్‌టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం. ఎఫ్‌టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుంది. శాస్త్రీయమైన పద్ధతుల్లోనే ఎఫ్‌టీఎల్ నిర్దారణ జరుగుతుంది. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం. 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వొస్తున్నాయి‘ అని రంగనాథ్ పేర్కొన్నారు.
‘27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తాం. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. త్వరలోనే 72 డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులోకి వొస్తాయి. నాగోల్‌లో ఉన్న డీఆర్‌ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుంది. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు.