– బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు
– మోసగాళ్లను పట్టుకున్న కారేపల్లి పోలీసులు
ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 31 : ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ నూనావత్ సాగర్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు రాగితో ఆభరణాలను తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారంలా కనిపించేలా తయారు చేసేవారన్నారు. అనంతరం నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడంతో పాటు, ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో ఇల్లెందు ముత్తుట్ ఫైనాన్స్ లో 52 గ్రాముల బంగారం పెట్టించి రూ.3.90 లక్షలు తీసుకున్నారు. దానిని రిలీజ్ చేయించడానికి ప్లాన్ చేసి హైదరాబాద్ లోని ‘మన గోల్డ్ కంపెనీ‘ ని సంప్రదించి వారి ప్రతినిధి ద్వారా మరో రూ.5.80 లక్షలు తీసుకుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి కారు, రూ.15 వేల నగదు, మొబైల్ పోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ సునీల్ కుమార్, కారేపల్లి మండల కేంద్రానికి చెందిన ముందాడా రామ్‌చందర్‌గా గుర్తించినట్లు తెలిపారు. మరో వ్యక్తి సూర్యతండాకు చెందిన దారవత్ రాకేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కారేపల్లి, కామేపల్లి ఎస్‌ఐలు భైరు గోపి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


