సుమారు 20వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరం
సంక్షేమ హాస్టళ్లలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
తక్షణమే సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
రాష్ట్రంలో రోజురోజుకు విద్యావ్యవస్థ పతనమైపోతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పేరుకుపోతున్నాయని తక్షణమే పరిష్కరించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేశారని, పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశారని లేఖలోపేర్కొన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందించారని తెలిపారు.
కానీ 9 నెలల కాంగ్రెస్ పాలనతో ప్రభుత్వ విద్యావ్యవస్థ పతనావస్థకు చేరుకున్నదని పేర్కొన్నారు. ఇంకా లేఖలో. హరీష్ రావు. పలు సమస్యలను ప్రస్తావించారు. పురుగులు లేని భోజనం కోసం, పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం, కనీస సౌకర్యాల కల్పన కోసం తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఒకవైపు టీచర్లు లేని కారణంగా బడులు మూతబడుతుంటే, మరోవైపు ప్రభుత్వ బడులపై నమ్మకంలేక డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయి.
మీ ప్రభుత్వ లెక్కలే ఈ వాస్తవాలను చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1864 ఉంటే, 30లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9,447 ఉన్నాయి. వందలోపు విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు 9,609. అంటే మీ 9 నెలల మీ పాలనలో మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలకు దాదాపు 20వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక గురుకులాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. బిఆర్ఎస్ ప్రభుత్వం పటిష్టపరిచిన గురుకులాలను మీ ప్రభుత్వం 9 నెలల్లోనే ధ్వంసం చేసింది. సంక్షేమ హాస్టళ్లలో,పరిశుభ్రత లోపించింది. పాఠశాల నుంచి కళాశాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా ఏ హాస్టల్ చూసినా దుర్బర పరిస్థితులే ఉన్నాయి. కుక్కకాటు, పాముకాటు, ఎలుక కాట్లు తో విద్యార్థులు దవాఖాలపాలవుతున్నారు. ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు 715 మందికి పైగా విద్యార్థులు హాస్పిటల్ పాలు కాగా, 40పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలి.
ఈ విద్యా సంవత్సరంలోనే దాదాపు 1900 పాఠశాలలు మూతపడ్డాయి. వాటిని తిరిగి ప్రారంభించాలి. పదోన్నతులతో ఏర్పడిన ఖాలీల్లో విద్యావాలంటీర్లను నియమించాలి. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, . తాగునీటి వసతి మెరుగుపరచాలి. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రారంభించాలి. మార్చి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో అవుట్ సోర్సింగ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలి. వసతి గృహాల అద్దెలు చెల్లించాలి. గురుకుల పాఠశాల విద్యార్థులకు రావాల్సిన రూ. 62 ( కాస్మోటిక్ రూ.50, హెయిర్ కటింగ్ రూ.12) ఇప్పటి వరకు అందలేదు. కాలేజీ హాస్టల్ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ. 500 పాకెట్ మనీ చెల్లించాలి. పాఠశాల వసతి గృహాల్లో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్, జులై, ఆగస్టు నెలల డైట్ చార్జీలు చెల్లించాలి. వార్డెన్లకు పెండింగ్ డైట్ చార్జీలను ఇవ్వాలి. ఎస్సీ గురుకుల విద్యార్థులకు నాలుగు జతల స్కూల్ యూనిఫార్మ్స్ వెంటనే అందించాలి. హాస్టళ్లలో దోమల జాలీలు, సోలార్ గీజర్లు ఏర్పాటు చేయాలని హరీస్ రావు బహిరంగ లేఖలోపేర్కొన్నారు.