డీటీఎఫ్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 29 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు (Semi Residential Government Schools) గా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి (T. Lingareddy) డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉమ్మడి కార్యవర్గ సమావేశం హనుమకొండ జిల్లా అధ్యక్షులు జి.ఉప్పలయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు కె.యాకయ్య అధ్యక్షతన స్థానిక ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఈ సమావేశంలో రెండు జిల్లాల ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్ , ఎ.గోవిందరావు సంఘం నివేదికను ప్రవేశపెట్టారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాలు ఇచ్చి పాఠశాలలోనే హోంవర్క్ చేయించిన తర్వాత విద్యార్థులను ఇంటికి పంపే విధానం చేపట్టాలని కోరారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన స్రవంతి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తూ వాటికి బదులు గత ప్రభుత్వం కులాలు, మతాల వారీగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లే, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ పేరిట కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఈ చర్యల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు. పిల్లల మధ్య అంతరాలను పెంచే వివిధ రకాల పాఠశాలలను కాకుండా అందరు విద్యార్థులు కలసి చదువుకునే ఒకే రకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించాలన్నారు.
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏ (DA)లను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. 01.07.2023 నుంచి అమలయ్యే విధంగా పీఆర్సీపై చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఖాళీగా ఉన్న, డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్స్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. అలాగే పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించడం సరికాదని, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, కేజిబీవీ ఉపాధ్యాయులకు, ఇతర ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరారు.
అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ ఇప్పటికీ సరిపడా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ యూనిఫార్మ్స్ అందజేయలేదని, వెంటనే అందజేయాలని కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగ,పెన్షనర్లు అందరికీ నగదు రహిత వైద్యం అందించే చర్యలు చేపట్టాలన్నారు.
కార్య్రమంలో హనుమకొండ, వరంగల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.ఉప్పలయ్య, కె.శ్రీనివాస్, కె.యాకయ్య ఎ.గోవిందరావు, వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు డి.మహేందర్ రెడ్డి డి.రవీందర్, జాన్ నాయక్, కొమ్మాలు, సూరయ్య ఆనందాచారి, రామస్వామి హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు సుభాషిని, అంజనీదేవి, సుమ, సారంగపాణి ఏ. మల్లయ్య, బాబురావు ఫ్రాన్సిస్ జేవియర్, ఎ.సంజీవరెడ్డి, కిషన్, హర్షవర్ధన్ రెడ్డి, మండలాల బాధ్యులు జి.రాజయ్య, రమేష్, టి.శ్రీనివాస్, రాజ్ కుమార్, రవీందర్, నవీన్ కుమార్, శ్రీనాథ్, సమ్మయ్య, వెంకటయ్య, ఎ.శ్రీనివాస్, వరంగల్ జిల్లా మండలాల బాధ్యులు అశోక్, బాలాజీ రాజకుమార్, సర్దార్, రఘువీర్, పి.రవి, రవీందర్, భద్రయ్య, శ్యాం ప్రసాద్, ఉమా శంకర్ శ్యాంసుందర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.