ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదు

– ద్రవిడ భావన దక్షిణాది స్వాభిమానాన్ని గౌరవించుకోవడమే
– దేశ బలం ఏకరూపతలో కాదు.. వైవిధ్యంలోనే ఉంది
– ‘ద్రవిడ వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ సభలో ప్రకాశ్‌రాజ్
– భాషను మతంతో ముడిపెట్టడం సరికాదు : ఘంటా చక్రపాణి

హైదరాబాద్, ఆగస్ట్ 8 (ప్రజాతంత్ర బ్యూరో): ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదని, దక్షిణాది భాషలు, సంస్కృతి, చరిత్ర, స్వాభిమానాన్ని గౌరవించుకోవడమేనని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, రచయిత ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. భారతీయుడిగా గర్విస్తూనే దక్షిణాది ప్రత్యేకతను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తిరునగిరి దేవకీదేవి అధ్యక్షతన ‘ద్రవిడ – వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే సంపాదకత్వంలో రూపొందిన పుస్తకాన్ని ప్రకాశ్‌రాజ్‌ ఆవిష్కరించి మాట్లాడారు. భారతదేశ బలం ఏకరూపతలో కాకుండా వైవిధ్యంలో ఉందని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. ఒకే భాష, ఒకే సంస్కృతిని దేశ వ్యాప్తంగా రుద్దడం సరికాదని, అన్ని భాషలు, సంస్కృతులకు సమాన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ కారణంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితి రాకుండా చూడాలని ఆయన సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ప్రయోజనాలను విస్మరించరాదన్నారు. ఈ సందర్భంగా రచయిత, సామాజిక విశ్లేషకులు ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ‘దక్షిణ స్వరం’ పుస్తకం భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సమకాలీన రాజకీయ అంశాలను చర్చిస్తోందన్నారు. భాషను మతంతో ముడిపెట్టడం సరికాదని, భారతీయత అంటే ఏకరూపత కాదని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, వ్యాసకర్తలు, సంపాదకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *