హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దు

ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి శతాబ్దాలు పడుతుంది..
హెచ్ సీయూ దేశంలోనే ఓ విశిష్టమైన విశ్వవిద్యాలయం
తొలి దశ ఉద్యమంలో 360 మంది విద్యార్థుల బలిదానం
సామాజిక వేత్త ప్రొఫెసర్ హరగోపాల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హెచ్ సీయూ అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి అని, చూస్తే కానీ అర్థం కాదని అన్నారు. ఇందులో ఎన్నో రకాల అత్యంత అరుదైన పక్షి జాతులు ఉన్నాయన్నారు. ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందన్నారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూ సమస్యపై హరగోపాల్ మీడియాతో మాట్లాడారు. హెచ్ సీయూ దేశంలో ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయం అని, దానికి ఒక అద్భుత చరిత్ర ఉందన్నారు. హెచ్ సీయూ భూములు ప్రభుత్వానిదే నని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నైతికంగా ఆ భూమి హెచ్ సీయూదే నని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి అడవిని నాశనం చేయడం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్న అనేక మంది పౌర సమాజ సంస్థలు, మేధావులతో కలసి మంగళవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశమై సమస్యలను వివరించామన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని, అడవిని నాశనం చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేసినప్పటికీ, ప్రభుత్వం దాని గురించి ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. పైగా అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని ప్రకటించారన్నారు.

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 360 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. దేశంలో ఏడు వందల విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ హెచ్ సీయూ మాత్రమే భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడిందన్నారు. విశ్వవిద్యాలయం అంటే ఒక విశాలమైన ప్రదేశం ఉండాలన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి 5 వేల ఎకరాలు, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి 8వేల ఎకరాలు, ఉస్మానియా యూనివర్సిటీకి 2,600 ఎకరాలు ఉన్నాయన్నారు. 800 ఎకరాలు సరిపోదని ఇందిరాగాంధీ అనడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హెచ్ సీయూకు 2,300 ఎకరాలు కేటాయించిందని అన్నారు. ఈ 400 ఎకరాలు ప్రజల భవిష్యత్ అని, ప్రభుత్వ అవసరం కాదన్నారు. ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలన్నారు.

ప్రజాభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వం పాలించాలన్నారు. ఇదే చివరి తరం కాదని, ప్రభుత్వానికి దూరదృష్టి, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత ఉండాలన్నారు. హెచ్ సీయూ భూముల వివాదానికి 2003లో చంద్రబాబు నాంది పలికాడని అన్నారు. కానీ 2004 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ వ్యక్తుల నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూమిని వెనక్కి తీసుకున్నారని అన్నారు. 50 ఏళ్లుగా హెచ్ సీయూ ఈ భూములను కాపాడుకుంటూ వస్తుందన్నారు. హెచ్ సీయూకు ఈ భూమితో పనిలేదు కానీ, అడవిని ధ్వంసం చేయకుండా ప్రభుత్వం ఫారెస్ట్ ఏరియాగా డెవలప్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకూడదని అన్నారు. అమ్మితే మిగతా యూనివర్సిటీలపై ఆ ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. దేశం నలుమూలల నుంచి ఈ యూనివర్సిటీలో చదువుకొని ఎంతోమంది ప్రయోజకులు అయ్యారన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నరసింహారెడ్డి, విస్సా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *