స‌ర‌స్వ‌తి పుష్కరాల‌పై పెద‌వి విరుపు

  • ఏర్పాట్ల‌పై  భక్తుల్లో అసంతృప్తి
  • నిధులు వెచ్చించినా సకాలంలో పూర్తికాని పనులు
  • నాసిరకం పనుల‌పై ఆగ్ర‌హం..
  • నిర్దిష్టమైన రూట్ మ్యాప్ లేక ట్రాఫిక్ జామ్ 
  • ఉచిత బస్సులపైనా తృప్తి చెందని భక్తులు 
  • కిలోమీటర్ల మేర కాలిన‌డ‌క‌తో ఇక్క‌ట్లు 
  • ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు! 
  • పుష్కరాల్లో ఆకర్షణగా నిలిచిన సరస్వతి నవరత్న మాల హారతి

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు ప్రభుత్వం అత్యంత  ప్రతిష్టాత్మకంగా  నిర్వహించిన సరస్వతి పుష్కరాలు (Saraswathi Pushkaralu ) సోమవారం ముగిశాయి. పుష్కరాలు ఆధ్యాత్మికత, భక్తి భావంతో ఇక్కడికి వచ్చినవారికి ఒకింత అసంతృప్తిని మిగిల్చాయనే భావన భక్తులలో వ్యక్తమవుతోంది. పుష్కరాల ప్రారంభం నుంచి కొన్ని దుర్ఘటనలు మినహా మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. గత 12 రోజులుగా లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే కిలోమీటర్ల మేర పిల్లాపాపలతో కాలినడకన నడుస్తూ ఇబ్బందులకు గురయినట్లు పెద్ద సంఖ్యలో భక్తులు ఆరోపిస్తున్నారు.

సకాలంలో పూర్తికాని పనులు..

సరస్వతీ పుష్కరాల కోసం ఆరు నెలల ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. విధులు కేటాయించి పనులను సకాలంలోపూర్తిచేయాలని నిర్దేశించినప్పటికీ అధికారుల పర్యవేక్షణ సమన్వయ లోపం కారణంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి కాలేదు.భక్తుల ప్రధానంగా పుష్కర స్నానంకు వచ్చే ప్రతి ఒక్కరు పిండ ప్రదానం చేయడానికి నిర్మించాల్సిన భవనం పూర్తి కాకపోవడంతో గోదావరి తీరమంతా పిండ ప్రదానాలతో అపరిశుభ్రంగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సరస్వతి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంలో పనులను శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన విభజించి సుమారు రూ.40 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో ఆన్లైన్ టెండర్లు పిలిచినప్పటికీ అధికార పార్టీ పలుకుబడి గల కాంట్రాక్టర్లు టెండర్లు వేయకుండా అడ్డుకొని తామే సర్వం అనే విధంగా వ్యవహరించి పదుల సంఖ్యలో పనులు దక్కించుకొని సకాలంలో పూర్తి చేయకుండా అరకొరగా నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు భక్తుల నుంచి బలంగా వినిపించాయి.

తాగునీటి కోసం అల్లాడిన భక్తులు

సరస్వతి పుష్కరాల (Saraswathi Pushkaralu ) కు లక్షలాదిగా తరలి వొచ్చిన భక్తులు వేసవి తీవ్రత కారణంగా పిల్లాపాపలు తాగునీటికి నానా కష్టాలు పడ్డారు.  పుష్కరాల ప్రారంభం నుండి తాగునీటి సమస్య కాళేశ్వరంలో కొట్టొచ్చినట్లు కనబడింది .అయినా అధికారులు సకాలంలో స్పందించలేదని భక్తులు ఆరోపించారు.

Pushkaralu
ఎడ్లబండ్లపై పుష్కరాల ప్రాంతానికి వెళ్లుతున్న భక్తులు

పుష్కరాలు 12 రోజులపాటు కొనసాగుతాయని తెలిసినప్పటికీ అందుకు తగిన విధంగా పార్కింగ్ ప్రదేశాల గుర్తింపులో పోలీసులు సరైన న రూట్ మ్యాప్ తో వ్యవహరించలేదనే  విమర్శలు వెలువత్తాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్,  మహారాష్ట్ర, చత్తీస్గడ్ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలకు గతంలో ప్రాణహిత పుష్కరాల సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రత్యేక  పార్కింగ్ ను ఏర్పాటు చేశారు .ఈసారి ఆ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడం మహారాష్ట్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ ఏర్పాటుకు కారణమైనట్లు వాహనదారులు ఆరోపించారు. అదేవిధంగా వరంగల్ హన్మకొండ ఖమ్మం ,నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వొచ్చే వాహనాలకు కరీంనగర్,మెదక్ నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్లను కేటాయించకపోవడం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు నానా ఇబ్బందులకు గురయ్యారని విమర్శలు వెలువత్తాయి.

వాహనాల పార్కింగ్ లో వివక్ష …. పుష్కరాలకు వొచ్చే విఐపి వాహనదారులకు  సరస్వతి పుష్కర ఘాటు వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతంలో ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న పార్కింగ్ ప్రదేశాలను ఖాళీగా ఉంచారు. మిగతావారికి దూరంగా ఉన్న పార్కింగ్ ప్రాంతాలను కేటాయించడంతో  అక్కడి నుంచి భక్తులు తమ సామాగ్రి,  పిల్లా పాపలతో సరస్వతి ఘాట్ వద్దకు చేరుకోవడం ప్రవేటు వాహనాలను అనుమతించకపోవడం ఎడ్లబండ్లపై పుష్కర ఘాటుకు చేరుకోవడం వంటి  ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Kaleshwaram

అకాల వర్షాలతో ఇబ్బందులు…

సరస్వతి పుష్కరాలు సజావుగా నిర్వహిస్తామని అధికారులు భావించినప్పటికీ అకాల వర్షాల కారణంగా భక్తుల కోసం ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం, పార్కింగ్ ప్రదేశాలు బురదమాయగా మారడం, విద్యుత్ నిలిచిపోవడం, కాళేశ్వరం పరిసరాలు బురదమయంగా మారడంతో భక్తులు అవస్థలు పడ్డారు.

పుష్కరాలకు వన్నెతెచ్చిన నవరత్న మాల హారతి….

సరస్వతీ పుష్కరాలలో భాగంగా విఐపి ఘాటు వద్ద ఏర్పాటు చేసిన 17 ఫీట్ల సరస్వతీ మాత విగ్రహం తో పాటు సరస్వతి ఘాటు వద్ద ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు నిర్వహించిన సరస్వతి నవరత్న మాల హారతి పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని  భక్తులు తెలిపారు.  ష్కరాల ఉత్సవాన్ని ప్రత్యేకంగా  సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది. కాశీ నుంచి వచ్చిన పూజారులు హారతి నిర్వహణపై  హర్షం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page