– దిద్దుబాటు చర్యలతో రేవంత్
– పదవి వచ్చినా, రాకున్నా తృప్తిలేని విచిత్ర పరిస్థితి
– మహిళానేతల్లో ఆగ్రహం
– పుష్పకవిమానంలా పార్టీ కార్యవర్గం
– కాంగ్రెస్ ఓ విరోధాభాస!!
మంత్రివర్గ విస్తరణ అంటేనే తేనెతుట్టెను కదిల్చినట్టు! నిత్య అసంతృప్త భుగభుగలతో నిండివుండే కాంగ్రెస్‌లో ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ ఇంతకాలం కొనసాగారంటే అందుకు ప్రధాన కారణం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన బలమైన నాయకుడిగా వుండటమే! లేకపోతే ఇప్పటికే తెలంగాణ ఇద్దరు లేదా ముగ్గురు ముఖ్యమంత్రులను చూడాల్సి వచ్చేది. అంతటి బలమైన నాయకుడు కూడా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేయలేదంటే, లేనిపోని తలనొప్పులు తలకెందుకెత్తు కోవాలన్న ఉద్దేశం కావచ్చు! ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది.
అధిష్టానం బాగా ఆలోచించి సామాజిక సమీకరణలను, రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తవారికి ఛాన్స్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే సామాజిక సమీకరణలను జాగ్రత్తగా అంచనావేసి మరీ కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడంతో అంతర్గతంగా బీజేపీ, బీఆర్ ఎస్ నాయకులుగా కూడా భేష్ అనక తప్పడంలేదు. కాంగ్రెస్‌లో పైకి అంతా అద్భుతమైన కూర్పు అంటూ మెచ్చుకుంటున్నప్పటికీ, అంతర్గతంగా సణుగుడులు వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పుడు జరిపిన విస్తరణలో ఆరు ఖాళీలుండగా ముగ్గురికి స్థానం కల్పించి మరో మూడు ఖాళీగా వుంచడం గమనార్హం. అసంతృప్తి స్థాయిని బట్టి ఆ ఖాళీలను పూరించవచ్చన్న వ్యూహం ఇందులో ఇమిడి వున్నదని భావించాలి.
మంత్రివర్గ విస్తరణలో గట్టి పోటీదారులుగా వున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పి. సుదర్శన్ రెడ్డిలకు సామాజిక సమీకరణ లెక్కల నేపథ్యంలో ఈసారీ నిరాశే మిగిలింది. ఇక చాలామంది కాంగ్రెస్ వృద్ధనాయకులు కూడా మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తితో వున్నారు. ఎందుకంటే తొలిసారి మంత్రులుగా ప్రమాణాలు చేసినవారు బయటనుంచి పార్టీలో చేరినవారే! ఉదాహరణకు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతెందుకు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి వచ్చినవారే కదా! పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తున్నామంటూ అసంతృప్తి వ్యక్తం చేసే నాయకులు ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఈ కొత్తగా వచ్చి చేరివారివల్లనే పార్టీ బలంగా తయారైంది.
పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోవడం తమ వైఫల్యంగా అంగీకరిస్తే, కొత్త, పాత అనే సమస్య రాదు! ఇదిలావుండగా పార్టీలో ప్రధానంగా వివేక్‌కు మంత్రిపదవి ఎందుకిచ్చారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన కుమారుడు వంశీకి ఎం.పి. టిక్కెట్, అదేవిధంగా ఆయన సోదరుడు వినోద్‌కు ఎమ్మెల్యే టిక్కట్ ఇచ్చారు. కుటుంబంలో ఒక్కరికే అవకాశమని చెబుతున్నప్పుడు వివేక్ కుటుంబంలో ఇంతమందికి అవకాశం ఎట్లా ఇచ్చారన్నది బలమైన విమర్శగా వినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే విషయాన్ని ఏఐసీసీ-ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పరిస్థితిని పసిగట్టిన మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి పి. సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌లకు ఫోన్లు చేసి బుజ్జగించినట్టు తెలుస్తోంది. అంతేకాదు అసంతృప్తిని సరిదిద్దే యత్నాల్లో తలమునకలుగా వున్నారు.
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌ను, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినట్లయింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంత్రిపదవులకోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు.
విచిత్రమేమంటే మంత్రిపదవులు రానివారితో పాటు, మంత్రిపదవుల్లో వున్నవారు కూడా అసలు ఉద్యమంలో పాలుపంచుకున్న వారికి మంత్రిపదవులివ్వలేదన్న కోపంతో వున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీసీ పల్లవి అందుకోవడమే కాదు, ఏకంగా సొంతపార్టీ వారిపైనే విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎం.పి. అంజన్‌కుమార్ యాదవ్ కూడా మల్లన్న బాటలోనే నడుస్తున్నారు. అయితే అప్పట్లో కేసీఆర్ కూడా ఉద్యమంతో సంబంధం లేనివారికి మంత్రిపదవులిచ్చిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. అంటే పార్టీల బలోపేతానికి బలమైన నాయకత్వం అవసరం కాబట్టి కొన్ని విషయాల్లో సర్దుకుపోక తప్పదు. ఇదే విధానాన్ని కె.సి.ఆర్.కు అనుసరించకతప్పలేదు.
ఇప్పుడు రేవంత్‌దీ అదే పరిస్థితి!
మంత్రిపదవులు రానివారిని పార్టీపదవుల్లో సర్దుబాటు చేద్దామంటే అక్కడా అసంతృప్తి రగులుతోంది. మహిళా నాయకురాళ్లు ఏకంగా అధిష్టానం దగ్గరే పంచాయతీ పెడతామని హూంకరిస్తున్నారు. ఈ అసంతృప్తులను చల్లార్చడానికి కాంగ్రెస్ ఇప్పటికే 27మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో ఒక జెంబోజెట్ కార్యవర్గాన్ని నియమించింది. అసలు ఇంతమందిలో ఎవరికి ఏ పని అప్పగించాలన్నది మరో ప్రధాన సమస్య. పనిలేకపోతే గుంపులో గోవిందయ్యలాగా వుండకత తప్పదు. అంటే పదవి వచ్చినా, రాకున్నా అసంతృప్తి శాశ్వతం అన్నట్టుగా వుంది! ఇందుకు ఉదాహరణ వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి. ఆయనకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఈ నామమాత్రపు పదవి నాకెందుకు? ఇంకెవరికైనా ఇవ్వండి అంటూ మొఖాన్నే చెప్పేశారు.
ఇక మహిళా నాయకురాళ్ల విషయానికి వస్తే 33శాతం రిజర్వేషన్లు ఎక్కడ అమలు పరచారు? కేవలం 15 మందికి అంటే మూడుశాతం పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ భద్రకాళులవుతున్నారు. ఏకంగా రాహుల్ గాంధీదగ్గరే పంచాయతీ పెడతామంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులాగా వున్న ఈ అసంతృప్తిని రేవంత్ ఏవిధంగా చల్లబరుస్తారో చూడాలి!