– ‘క్యూర్’ పరిధిలో అర్భన్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత
– రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు
– అధికార యంత్రాంగానికి మంత్రి పొంగులేటి దిశానిర్ధేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ‘క్యూర్’ పరిధిలో అఫర్డ్‌బుల్ ఎల్ఐజి అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పధకం విజయవంతమైందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఇదే స్పూర్తిని ‘క్యూర’ పరిధిలో చేపట్టబోయే అఫర్డ్‌బుల్ ఎల్ఐజి అర్బన్ హౌసింగ్‌పై కూడా చూపించాలన్నారు. ‘క్యూర్’ పరిధిలో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ ఆలోచనల మేరకు రెవెన్యూ, హౌసింగ్ విభాగాల అధికారులు సమష్టిగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీలైనంత త్వరగా పేదలకు ఇళ్లు అందించే విధంగా స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా ఇప్పటికే ఖరారైన స్ధలాలలో పొజిషన్ తీసుకుని ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన కార్యాచరణను వేగవంతంగా రూపొందించాలని ఆదేశించారు. ఇంకా కొన్ని నియోజకవర్గాలలో స్ధలాలను గుర్తించి తక్షణమే ఖరారు చేయాల్సి ఉందన్నారు. ‘క్యూర’ పరిధిలోని 26 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గంలో తొలి విడతలో 500 ఇళ్లు నిర్మిస్తున్నామని, వీటికి టెండర్లను వీలైనంత త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది ఆర్డీవో, 107 తహసీల్దార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించి రెండు డీఐజి, నాలుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని,ఈ భవనాలన్నీ ఒకే డిజైన్‌లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మిస్తామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సోలార్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తాం అని మంత్రి పొంగులేటి తెలిపారు. సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





