అల్లూరి త్యాగం అనిర్వచనీయం

– అన్యాయాన్ని ప్రశ్నించడమే నిజమైన నివాళి
– అల్లూరి జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి శనివారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కేవలం 27 ఏళ్ల ప్రాయంలోనే దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని కొనియాడారు. ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల కోసమే సాగిన ఆయన విప్లవ పోరాటం నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, స్వేచ్ఛాకాంక్ష గల ప్రతి భారతీయుడి గుండెల్లో కొలువై ఉన్న ఒక గొప్ప శక్తి అని అభివర్ణించారు. జయంతి వేడుకల్లో భాగంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సమకూర్చిన అంబులెన్స్‌ను భట్టి విక్రమార్క మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. పోలీసుల విధి నిర్వహణలో, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఈ అంబులెన్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, నాగరాజు, బంగారురాజు, డి.ఎస్.రాజు, జగన్నాధ్ రాజు, రమణప్రసాద్, రామక్రిష్ణంరాజు, సామాజిక ప్రముఖులు, క్షత్రియ సంఘ సభ్యులు, అల్లూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *