పాలమూరును ఏడారి చేసింది బీఆర్ఎస్సే..
ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం
రాబోయే నాలుగేళ్లూ.. రైతు పండుగలు చేస్తాం
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
వనపర్తి (మహబూబ నగర్) ప్రజాతంత్ర నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మండల పరిధిలోగల అమిస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన రైతు పండుగ మూడో రోజు ముగింపు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి ఉపముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాలేదు.. ఆలోపే ప్రతిపక్షాలు ప్రజల వద్దకు పోతాం.. నిలదీసాం.. ఇంకొకటి చేస్తామంటే ఎవరూ నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు, యువత, రైతుల కళ్లలో ఆనందం కోసం ఏనాడు కూడా పట్టించుకునే పాపన పోలేదని, రైతులకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. పాలమూరులో కృష్ణానది పరీవాహక నీళ్లు ఉన్నా కూడా పాలమూరు ఎండబెట్టారని, గతంలో పాలమూరుకు రంగారెడ్డికి నల్గొండకు నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన ఆ రోజులోనే కాంగ్రెస్ చేసిందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు మళ్లీ కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తిరిగి రివ్యూ మీటింగ్ పెట్టి పనులు పూర్తి చేయాలని చూస్తున్నామని అన్నారు. గతంలో కాంగ్రెస్ జూరాల, కోయిల్ సాగర్.
బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ప్రజలను కట్టించి రైతుల బీడు భూములకు నీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మొత్తం కుదువబెట్టి అప్పులను కుప్పలుగా చేసి కాళేశ్వరం కట్టి మేడిగడ్డ. తుమ్మల, అన్నారం ప్రాజెక్టులు కుంగిపోయాయని అన్నారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో కడెం, శ్రీపాద, ఎల్లంపల్లి లోయర్ ప్రాజెక్టులు నుంచి సాగునీరు తీసుకొని 66 లక్షలు 77 వరి సాగు చేశామని.. మొత్తం 153 లక్షల టన్నుల అత్యధిక పంట పండించామని అన్నారు. పదేళ్లలో లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేయకుండా నాలుగేళ్లు 2018 నుంచి 2023 వరకు నాన్చుడు ధోరణితో కాలం గడిపారని రైతులకు వడ్డీలకు కూడా సరిపోలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం లోపే రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తుందని ప్రభుత్వం ఏర్పడిన 17 రోజుల్లోనే లక్ష లోపు వారికి 18 వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిందని ఆయన అన్నారు. ఇంత పెద్ద ఎత్తున సంవత్సరంలోపే రైతుల కు రుణాలు మాకు చేస్తే సమర్థించేది పోయి ధర్నాలు చేస్తాం ఉద్యమాలు చేస్తాం అంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.
కొంతమంది రైతులకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకులో చిన్నపాటి తప్పుల వల్ల రుణాలు ఆగిపోయాయని మిగిలిన రైతులకు అధికారులను ఇంటింటి తిరిగి వారి పేర్లను నమోదు చేసుకొని లెక్క తేల్చమని చెప్పామని వారికి ప్రస్తుతం 3000 కోట్ల రూపాయలు రుణమాఫీ అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇంత పెద్ద ఎత్తున రైతుల పండుగ చేస్తుంటే ప్రతిపక్షాల కళ్ళలో నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం రైతు సంక్షేమం పడకేసిందని రుణమాఫీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీతో పాటు పంట నష్టపోయిన వారికి కూడా రూ.10,000 చొప్పున 100 కోట్లు మంజూరు చేశామని. గత ప్రభుత్వం రైతులపై వివక్షతో బీమా చెల్లించలేదని రైతుల బీమా కోసం ఇన్సూరెన్స్ కు ఒక వెయ్యి నాలుగు వందల 33 కోట్లు చెల్లించామన్నారు. అదేవిధంగా పంట ఇన్సూరెన్స్ కోసం రూ.2500 కోట్లను ప్రభుత్వం కట్టేందుకు ముందుకు వొచ్చిందని అన్నారు. గతంలో రైతులకు స్పీకర్లు. వ్యవసాయ పనిముట్లను ఇవ్వకుండా ఉందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి 73 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించామని ఆయన అన్నారు.