ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : రైతులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్ పేట్, ఆర్‌సిఇ రోడ్డుకు రూ.32 కోట్లు, తుక్కుగూడ మున్సిపాలిటీ పలు అభివృద్ధి పనులకు 15 కోట్లు 74 లక్షలు, నేదునూరి రోడ్డుకు 17 కోట్లు, మూడు యూపిహెచ్‌సిలకు 1 కోటి 43 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, ఎన్నిక ముందు ఇచ్చిన హామీల మేరకు రుణమాఫీ, వరికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో 10 ఏళ్ల కాలంలో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ శాఖల్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఘనత సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నికే దక్కుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఫోర్త్ సీటితో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్ , వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.