బీఆర్ఎస్ తెచ్చిన అప్పు రూ.4,17,495 కోట్లు మాత్ర‌మే

– దీనిపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం.. ఇదే మా స్టాండ్‌
– ఈ అప్పుల‌తో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆస్తులు, ఆదాయం పెంచింది
– డిప్యూటీ సీఎం చెప్పిన రూ.8,21,651 కోట్లు క‌ట్టు క‌థ‌
– అప్పుల‌పై ర‌క‌ర‌కాల లెక్క‌లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు
– కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ల దాడి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 4:  భట్టి విక్రమార్క అప్పుల విషయంలో అబద్దాలు, అర్థ సత్యాలు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేసిండు.. ఆయ‌న‌కు అప్పుల విషయంలో వాస్తవాలు తెలియవు అని నేను అనుకోను.. తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు.. లేని అప్పులను ఉన్నట్లుగా చూపి గోబెల్స్ ప్రచారానికి పాల్పడ్డారని బీఆర్ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న శ‌నివారం విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ అప్పుల‌ విషయంలో మంత్రి జూపల్లి సవాళ్లు చేసి తోక ముడిచిన తీరును యావత్ సమాజం చూసింది.. ఆ అవమానం నుంచి ఎలాగైనా బయటపడాలనే భావనతో, ఆత్మరక్షణలో భాగంగా భట్టి అప్పులపై తప్పుడు లెక్కలు వండి వార్చారన్నారు. మేం అప్పుల విషయంలో క్లిస్టర్ క్లియర్ గా ఉన్నం.. ఈరోజు మళ్లీ ఒకసారి భట్టి, రేవంత్ రెడ్డికి, మంత్రులందరికి, ప్రజలందరికీ ఆధారాలతో అప్పుల విషయంలో స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మేనిఫెస్టోలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? అప్పులు అప్పులు అంటూ ఎందుకు కుంటి సాకులు, సొల్లు పురాణం చెబుతున్నరు అని ప్ర‌శ్నించారు. కరోనా వచ్చి ఎకానమీ డౌన్ అయినా కేసీఆర్ హ‌యాంలో ఏనాడూ రాష్ట్రం దివాలా తీసింది అనలేదు.. మరి ఇప్పుడు కరోనా లేదు.. పెద్ద నోట్ల రద్దు లేదు.. మీ ముఖ్యమంత్రి ఎందుకు దివాలా అని మాట్లాడుతున్నరు? అంటే పాలనలో మీ ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యారని ఒప్పకుంటున్నారా? మీ అపారమైన అనుభవం కమీషన్లు దండుకోవడానికి తప్ప రాష్ట్ర అభివృద్దికి ఉపయోగపడలేదు అని ధ్వ‌జ‌మెత్తారు. నిన్న భట్టి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి అప్పుల విషయంలో అర్థరహితంగా మాట్లాడిండు.. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు.. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.8,21,651 కోట్లు అని మళ్లీ అదే కట్టుకథ చెప్పిండు అని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన 2014 జూన్ 2 నాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఎఫ్ఆర్‌బీఎం రుణాలు, ఎస్‌పీవీ గ్యారంటీ రుణాలు మొత్తం కలిపి రూ.84,268 కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో చూపారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న ఎఫ్ఆర్‌బీఎం రుణాలు రూ.15,118 కోట్లు. దీన్ని కూడా బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల్లో కలిపారు. (ఆర్బీఐ రిపోర్టు ఆధారం) అంటే రూ.84,268 కోట్లు + రూ.15,118 కోట్లు = రూ.99,386 కోట్లు ఈ మొత్తాన్ని 2023 డిసెంబ‌ర్ 7 నాటికి ప్రభుత్వంపై ఉన్న మొత్తం బకాయి రుణాలు రూ.5,16,881 కోట్ల నుంచి తీసివేస్తే, రూ.4,17,495 కోట్లు. ఇదే నేను చెప్పిన లెక్క. మీ డాక్యుమెంట్ ప్రకారమే చెబుతున్నా? ఎన్ని కలిపినా వాళ్లు చెప్పిన 8,21,651 కోట్లు నిండటం లేదని అందులో ఏం ఏం కలిపారో మీరే చూడండి. ప్రభుత్వం గ్యారెంటీ ఉండి, కార్పోరేషన్లు చెల్లించేవి, ప్రభుత్వం గ్యారెంటీ లేకుండా కార్పోరేషన్లే చెల్లించేవి కలిపారు. నిజానికి ఈ రుణాలు వాటికవే చెల్లిస్తాయి. ఆర్బీఐ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లోనే ఉంటది ఎవరైనా తెలంగాణ అప్పులు ఎంత తెచ్చిందో చూడొచ్చు. ఇది మాత్రమే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు గురించి కాగ్ రిపోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. 2024 మార్చి నాటికి ప్రభుత్వమే చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ 1,20,944 కోట్లు. ఇందులో భట్టి  చెప్పిన డాక్యుమెంట్ లో 2014, జూన్ 2నాటికి ఉన్న ప్రభుత్వం చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.11,609 కోట్లు తీస్తే 1,09,335 కోట్లు ఉంటుంది. తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ 2025–26, 14వ పేజీలో చెప్పిన దాని ప్రకారం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న రుణాలు 3,01,484 కోట్లు. అంటే 3,01,484 కోట్లు + 1,09,335 కోట్లు = 4,10,819 కోట్లు. ఇది మేము చెబుతున్న లెక్క కాదు ‘కాగ్’ చెబుతున్న లెక్క. మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ, స్కీలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,10,819 కోట్లు అని ‘కాగ్’ స్పష్టం చేసింది. ఆ రిపోర్టు మీరు డిసెంబర్ 2023 వైట్ పేపర్ లో చెప్పిన ప్రకారం బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 4.17లక్షల కోట్లు. ఇష్టం ఉన్నట్లు లెక్కలు కట్టి అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకు మళ్లీ చెబుతున్నా.. మీ శ్వేతపత్రం ప్రకారం చూసినా, బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారం చూసినా, కాగ్ రిపోర్టు ప్రకారం చూసినా, మీ ఎకనామిక్ సర్వే ప్రకారం చూసినా బిఆర్ఎస్ హయాంలో చేసిన 4.17లక్షల కోట్లు దాటలేదు. ఇది మా స్టాండ్ దీని మీద ఎక్కడ, ఎప్పుడు చర్చకైనా సిద్దమని చెబుతున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై పూటకో మాట. వీళ్లు చెబుతున్న అప్పుల లెక్క మీద నిలబడతారా అంటే అదీ లేదు. పూటకో మాట, నచ్చినట్లు లెక్కలు మార్చుతూ, అబద్దాలు ప్రచారం చేస్తున్నరు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 6,71,757 కోట్లు అని చెప్పారు. ఇందులో కూడా మాకు సంబంధం లేనివి కలిపారు. మొన్న జూపల్లి  ఏమన్నరు, ముందు రోజు 8లక్షల కోట్ల అప్పు అన్నడు, తెల్లారి 7లక్షల కోట్ల అప్పు అన్నడు. శ్వేతపత్రంలో ఒక లెక్క, అసెంబ్లీలో ఒక లెక్క, పత్రికా సమావేశాల్లో ఒక లెక్క ఉంటదా? మీరు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మర్లించడం కోసం, మీరు చేస్తున్న స్కాంల నుంచి డైవర్షన్ చేయడం కోసం అప్పుల పేరుతో డ్రామాలు ఆడుతున్నరు. స్కాంలు బయట పడుతుంటే, ప్రజలు తిరగబడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నరు. 8.21 లక్షల కోట్ల అప్పు అనేది కట్టు కథ. వాళ్లు తెచ్చిన అప్పుల విషయంలోనూ తలో మాట. నిన్న భట్టి గారు లక్ష 77 వేల కోట్ల అప్పు తెచ్చినం అంటే.. 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎఫ్ఆర్ బీఎంపాటు, అన్ని రకాల అప్పు ఫిబ్రవరి 28,2026 నాటికి చేసిన అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు. నాలుగు నెల్లలో అప్పు ఎట్ల తగ్గింది రేవంత్ రెడ్డి, భట్టి గారు? ఇదంతా గారడీ కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ముఖ్యమంత్రి కరెక్టా? భట్టి  కరెక్టా? జూన్ 30 నాటికి పబ్లిక్ డొమైన్ ఉన్న లెక్కల ప్రకారం 31 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మొత్తం అప్పు నాలుగున్నర లక్షల 50వేల కోట్లు. లంచాలు ఇచ్చి తెస్తున్న అప్పులు. ఎంత దారుణం అంటే.. ఒక దిక్కు బిఆర్ఎస్ అప్పులు చేసింది అని దుష్ప్ర‌చారం చేస్తూ వీళ్లు వేల కోట్ల అప్పులు దొంగదారిన లంచాలు ఇస్తూ తెస్తున్నరు. వీళ్ల బండారం మొత్తం అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నతోనే బట్టబయలైంది. వేల కోట్ల రూపాయల అప్పులు ఎఫ్ఆర్ బిఎం పరిధిలోకి రాకుండా, వందల కోట్ల లంచాలు (బ్రోకర్ కమీషన్లు) ఇచ్చి తెస్తున్నరు. ప్రభుత్వమే అప్పుల కోసం బ్రోకర్లకు లంచాలు ఇచ్చే పరిస్థితికి దిగజారింది.. అందుకే రేవంత్ రెడ్డిని దొంగలాగా చూస్తున్నరు. దేశ చరిత్రలో ఇంత దిక్కుమాలిన పని చేసిన ప్రభుత్వం మరొకటి ఉండదు. టీజీఐఐసీ భూములను కుదువపెట్టి 10వేల కోట్ల అప్పు తేవడానికి ఇచ్చిన బ్రోకరేజ్ చార్జీ ఎంత అంటే వీళ్లు ఇచ్చిన సమాధానం…. 170 కోట్లు అదే అసెంబ్లీలో మరో ప్రశ్నకు అడిగినం… హెచ్ ఎండీఏ భూములు కుదువ పెట్టడం ద్వారా ఎంత అప్పు సేకరిచించాలనుకుం టున్నారు అని అడిగితే వచ్చిన సమాధానం.. మరో 20వేల కోట్లు అప్పు తెస్తాం అన్నరు. అంటే 10,000 కోట్ల అప్పుకు 170 కోట్లు బ్రోకర్ చార్జీ చెల్లిస్తే, మొత్తం 30 వేల కోట్లకు గాను బ్రోకర్లకు చెల్లిస్తున్న డబ్బు అక్షరాల రూ. 510 కోట్లు. దీన్ని బ్రోకరేజ్ అంటరా? లంచం అంటరా? ఏమంటరో ప్రభుత్వమే సమాధానం చెప్పాలె. ఇది మాత్రమే కాదు ఇట్లనే వందల కోట్ల లంచాలు ఇచ్చి… మూడు హైదరాబాద్ కార్పొరేషన్లు, డిస్కంలు, హెచ్ ఎండ‌బ్ల్యు ఎస్‌ ద్వారా మరో 70,000 కోట్ల అప్పు తేవాలని టార్గెట్ పెట్టుకున్నరు. అంటే ఈ 70వేల కోట్ల అప్పు కోసం రేవంత్ రెడ్డి బ్రోకర్లకు ఇచ్చే లంచం 1200 కోట్లు. అంటే ఈ 1200 పైనవి ఈ 510 కలిపితే మొత్తం 1710 కోట్లు లక్ష కోట్ల అప్పు కోసం 1710 కోట్లు బ్రోకర్లకు లంచాలు చెలిస్తున్నది ఈ ప్రభుత్వం. బాండ్ల ముసుగులో ఇదంతా చేస్తున్నరు. బొందల గడ్డకు కూడా జాగ లేకుండా ఖతం పట్టిస్తున్నరు. ఫైనాన్స్ గ్రాంట్ ఇవ్వడం లేదు మీరు తెచ్చుకోండి అంటే మేం అప్పు తెచ్చుకున్నం, కరోనా వల్ల అప్పు లిమిట్ పెంచితే కొంత తెచ్చుకున్నం, ఉదయ్ స్కీం ద్వారా కేంద్రం బలవంతంగా రుద్దిన అప్పు, జీఎస్టీ పరిహారంగా తెచ్చిన అప్పు ఇవన్నీ మేము చెబుతున్న 4.17లక్షల కోట్ల అప్పులో ఉన్నాయి. మేమీ 4.17లక్షల కోట్లతో… కాలేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క సాగర్, రైతు బంధుకు 72,972కోట్లు రైతు బీమా 6,800 కోట్లు, రైతు రుణమాఫీ 29వేల కోట్లు, ఉచిత కరెంట్ కు 61వేల కోట్లు, గొర్రెల పంపిణీకి 5వేల కోట్లు, మీరు కూర్చుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం, పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ, జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టినం. సొంత ఆదాయ వనరులను పెంచినం జీఎస్డీపీ 4,51,580 కోట్ల నుంచి 13,13,391 కోట్లకు పెంచినం, తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 నుంచి 3,17,117 కోట్లకు పెంచినం. ఇవన్నీ ఎందుకు మాట్లాడరు. ఇవన్నీ కళ్ల ముందే ఉన్నాయి కదా? ఇప్పుడు మీరేం చేస్తున్నరు. కరోనా లేదు, నోట్ల రద్దు లేదు, కేంద్రం మెడ మీద కత్తి పెట్టలేదు.   భట్టి  నిన్న సింగరేణి గురించి మాట్లాడారు.. 40లక్షల బొగ్గు మాయంపై సింగరేణి విజిలెన్స్ విచారణ చేస్తదట. దొంగకే తనకు తానుగా విచారణ చేసుకోమని చెప్పినట్లుంది. సింగరేణిలో కుంభకోణాలు జరిగితే, అదే సింగరేణి విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తాం అనడంలో అర్థం ఉందా? వెయ్యి కోట్ల సోలార్ పవర్ స్కాం గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ బార్డర్ జైసల్మేర్ లో సోలార్ ప్లాంట్ పెడతాం అన్నరు. ఆ స్కాం గురించి మాట్లాడరు. సింగరేణిలో ఎక్స్ ప్లోసివ్ స్కాం గురించి మాట్లాడరు. డీజిల్ స్కాం గురించి మాట్లాడరు. చేతనైతే పాలన మీద దృష్టి పెట్టండి. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, శాసన సభ్యుడిగా, కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చెబుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17లక్షల కోట్లు మాత్రమే దీనికి నేను కట్టుబడి ఉన్నా ఏ చర్చకైనా సిద్దం. పెట్టండి అసెంబ్లీ మాట్లాడుదాం అని హ‌రీష్‌రావు స‌వాల్ విసిరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *