సీపీఎం నేత సామినేని దారుణ హత్య

– ఖమ్మం జిల్లాలో దారుణం
– వాకింగ్‌ చేస్తుండగా గొంతు కోసి చంపిన దుండగులు
– రాజకీయ వర్గాల్లో కలకలం

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జ‌రిగింది. చింతకాని మండలం పాతర్లపాడులో శుక్రవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా సీపీఎం సీనియ‌ర్‌ నాయకుడు సామినేని రామారావుపై దుండుగులు ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేసి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈయన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పాతర్లపాడు సర్పంచ్‌గా కూడా పనిచేశారు. ఆయన హత్యతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. దోషులను త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాకింగ్‌ చేస్తున్న రాజకీయ నేత దారుణ హత్యకు గురి కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో ఓవైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రత్యర్థులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆయన కుటుంబీకులతో మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కమటీ నేతలు పోతినేని సుదర్శన్‌, పొన్నం వెంకటేశ్వరరావుతోపాటు పలువురు నేతలు రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. పాతర్లపాడులో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం భట్టి

సీపీఎం సీనియర్‌ నేత సామినేని రామారావు హత్యకు గురికావడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హింసకు తావు లేదన్నారు. శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్‌ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. క్లూస్‌ టీం, స్నిఫర్‌ డాగ్స్‌, సైబర్‌ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దోషులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రామారావు కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page