- ముంబైలో అత్యధిక కేసులు నమోదు
- ఆందోళన కలిగిస్తున్న మరణాలు
- భయపడాల్సిందేమీ లేదు: కేంద్రం
దక్షిణాసియాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కొరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈఏడాది జనవరి నుంచి మహారాష్ట్ర లో ఏకంగా వందకుపైగా పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్‌లు చేయగా 106 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు థానే, పూణె, కొల్హాపూర్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జనవరి నుంచి రెండు కొవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది.
మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్ రోగి అని పేర్కొంది. దేశంలో కొవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతోపాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానలను ఆదేశించింది.సింగపూర్, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో సింగపూర్‌లో 11వేల కేసులు నమోదుకాగా, మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000 దాటింది.
హాంకాంగ్‌లో మే మొదటివారంలో 1000కిపైగా కొత్త కేసులు నమోదుకాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనూ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫ్లూ లక్షణాలతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి జేఎన్.1, దాని సబ్‌వేరియంట్‌లే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని సింగపూర్ తెలిపింది.