సంతుష్టీకరణ రాజకీయాలు vs అభివృద్ధి రాజకీయాలు

 – ఉప ఎన్నికను అభివర్ణించిన డాక్టర్‌ లక్ష్మణ్‌
– కాంగ్రెస్‌ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి
– కొన‌సాగుతున్న‌బీఆర్‌ఎస్‌ తరహా ఆటలు
– దీపక్‌ రెడ్డిని గెలిపించాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: తెలంగాణలో జరుగుతున్న రాజకీయ క్రీడలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఎంఐఎంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్‌ చేసినట్లే కాంగ్రెస్‌ కూడా ఎంఐఎంను పెంచి పోషిస్తూ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరపున ఆయన సోమవారం ప్రచారం చేశారు. ఈ ఎన్నిక ప్రధానంగా బీజేపీ, మతోన్మాద ఎంఐఎం మధ్య పోరుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా దారుస్సలాం నుంచే ఆదేశాలు జారీ అవుతాయని గతంలో పలికిన ఎంఐఎం పార్టీ రాజ్యాంగంతో ఆడుకుందని గుర్తు చేసిన లక్ష్మణ్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ఆ ఆటలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ముసుగులో ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఇది తెలంగాణ ప్రజల అభివృద్ధిని అడ్డగించే ప్రయత్నం అని విమర్శించారు. ఈ ఉపఎన్నికను సంతుష్టీకరణ రాజకీయాలు (అప్పీజ్‌మెంట్‌ పొలిటిక్స్‌)తో అభివృద్ధి రాజకీయాల మధ్య పోటీగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మోడల్‌ను తెలంగాణలో కూడా అమలు చేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తెలంగాణను భ్రష్టాచార పాలిటిక్స్‌తో, అప్పులతో కుంగదీసాయని విమర్శించారు. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి రేటును గమనించండి. అలాంటి మార్పు తెలంగాణలో కూడా రావాలి అని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా మార్పు వస్తుందని, జూబ్లీహిల్స్‌లో బీజేపీ యువ నాయకుడు దీపక్‌ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

కిషన్‌ రెడ్డి మోడల్‌తో అభివృద్ధి

కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూస్తే జూబ్లీహిల్స్‌లో కూడా అదే తరహా ప్రగతి సాధ్యమేనని లక్ష్మణ్‌ తెలిపారు. కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారు. దీపక్‌ రెడ్డి గెలిస్తే జూబ్లీహిల్స్‌ కూడా అలాంటి మార్పు చూస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

హైదరాబాద్‌లో గన్‌, డ్రగ్‌ కల్చర్‌

నగరంలో గన్‌ కల్చర్‌, డ్రగ్‌ కల్చర్‌ మహమ్మారులా వ్యాపిస్తున్నాయని, యువత మత్తుపదార్థాల అలవాటుకు బానిసలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని లక్ష్మణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నుంచి విముక్తి, మార్పు రావాలంటే ఉప ఎన్నికలో దీపక్‌ రెడ్డిని గెలిపించడమే పరిష్కారమని స్పష్టం చేశారు. ఈ ఎన్నిక ఫలితాలు రాజకీయాలను మలుపు తిప్పుతాయంటూ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో పలువురు నాయకులు, అనేకమంది కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page