జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు ఉంటుంది. ఈ మూడు ఏండ్లకాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయన్న అభిప్రాయం మేరకే స్థానిక ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి కారణమనుకుంటున్నారు..”

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టకేలకు కాంగ్రెస్‌ ‌విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ ‌బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24వేల729 వోట్ల మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలో ఇంతటి మెజార్టీ రావడమన్నది ఇదే మొదటిసారి. దీంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో అమితోత్సాహం చోటుచేసుకుంది. టపాకాయలు పేల్చడం, స్వీట్లు పంచుకోవడం, ఒకరికొకరు ఆలింగనం చేసుకుని సంతోషాన్ని ప్రకటించుకున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జూబ్లీహిల్స్ ‌గెలుపు ఆయన సాధించిన రెండవ ఘనవిజయం. ఇంతకు క్రితం కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ‌విజయ దుందుబిని మోగించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇమేజ్‌ ‌మరింత పెరిగినట్లైంది. కాంగ్రెస్‌ ఇటీవలకాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న పలు నిర్ణయాలే ఆ పార్టీని గెలిపించాయని అనుకుంటున్నారు.

వాస్తవానికి ఉప ఎన్నికల తేదీ ప్రకటించినప్పటినుండి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపైన ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్న విషయం బాగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపైన ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం జరిగింది. దానికి తోడు ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోవడంవల్ల ప్రభుత్వం వివిధ పథకాల్లో లబ్దిదారులకు ఎంత బకాయి పడింది కార్డులను ప్రింట్‌చేసి మరీ ప్రచారం చేసింది. అయినా ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంకట్టడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు.

కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు ఉంటుంది. ఈ మూడు ఏండ్లకాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయన్న అభిప్రాయం మేరకే స్థానిక ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి కారణమనుకుంటున్నారు. అన్నిటికి మించి తమ అభ్యర్థిని ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాల్సిందేన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుదలకూడా బాగా పనిచేసింది. దాదాపు వారం రోజులపాటు ప్రతీ డివిజన్‌లో సమావేశాలు ఏర్పాటుచేసి, ప్రజలను ఆకట్టుకోగలిగారు. కార్యకర్తలు, మంత్రులు మైన్యూట్‌ ‌స్థాయిలో ప్రచారం చేయడం కూడా ఆ పార్టీ విజయానికి కారణంగా మారింది. అందుకే శుక్రవారం వోట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటినుండీ ప్రతీ రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌లీడ్‌లో ఉండటం గమనార్హం. జూబ్లీహిల్స్ ‌గెలుపు కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్లస్‌ ‌పాయింట్‌ అయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీటుకు మాత్రం ధోకాలేకుండా పోయిందనే చెప్పవచ్చు. నిన్నటివరకు ఆయనపట్ల అసంతృప్తిగా ఉన్నవారిని ఈ ఫలితాలు ఒకవిధంగా ఆలోచింప చేసేవిగా ఉన్నాయి.

బిఆర్‌ఎస్‌ ‌విషయానికొస్తే.. ఆ పార్టీ సెంటిమెంట్‌ ‌ప్రయోగం పనిచేయకుండా పోయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎదర్కోవడంలో తమ శక్తివంచనలేకుండా పనిచేసినా లాభంలేకుండా పోయింది. ఇదే నియోజకవర్గంలో మూడు ఎన్నికల్లో గోపీనాథ్‌ను ఆదరించిన ప్రజలు ఆయన భార్య మాగంటి సునీత విషయంలో చూపించలేదన్నది స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఈ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ ‌విడుదల కాకముందే మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించి, అన్ని పార్టీలకాన్న ముందునుండే ప్రచార కార్యక్రమానికి బిఆర్‌ఎస్‌ శ్రీ‌కారం చుట్టింది. కాంగ్రెస్‌ ‌ఫెల్యూర్స్‌ను విస్తృతంగా ప్రచారం చేసింది. పార్టీ ముఖ్యనేతలు కెటిఆర్‌, ‌హరీష్‌రావులు అంతా తామే అయి చేసిన ప్రచారానికి ఫలితం లేకుండా పోయింది.

గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటినుండీ బిఆర్‌ఎస్‌ అనేక సంక్షోభాలను చవిచూడాల్సి వచ్చింది. అధికారం పోగానే ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది. కవిత ఎపిసోడ్‌ ‌మరో దెబ్బ. ఒకటి దిల్లీ లిక్కర్‌ ‌కేసులో జైల్‌ ‌పాలుకాగా, ఏకంగా పార్టీనుండి బహిష్కరించబడటం లాంటి పరిణామాలు పార్టీని సంక్షోభంలోకి నెట్టాయి. కాబోయే సిఎంగా ప్రచారంలో ఉన్న కెటిఆర్‌పైన వొచ్చిన పలు ఆరోపణలు, కాళేశ్వరం కుంగుబాటు లాంటివి ఆ పార్టీకి ఊపిరి సల్పకుండా చేశాయి. అన్నిటికిమించి తెలంగాణకు, బిఆర్‌ఎస్‌కు పెద్ద దిక్కుగా భావిస్తున్న కెసిఆర్‌ ‌కనీసం తమ పార్టీ అభ్యర్థి పక్షాన ప్రచారం చేయకపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. చివరి రోజునైనా కెసిఆర్‌ ‌వొస్తాడని ఎదిరి చూసిన వారికి నిరాశే ఎదురైంది. ఇవన్నికూడా బిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page